టిఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం పై కాంగ్రెస్ నేతల సంచలన నిర్ణయం

శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టిఆర్ ఎస్ లో విలీనం చేయడం పై టి కాంగ్రెస్ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు శాసన మండలి పక్షం సమావేశం కాకుండానే విలీనాన్ని ఎలా ఆమోదిస్తారని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో కాంగ్రెస్ ఎల్పీని టిఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా టిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.

హైకోర్టులో పిటిషన్ వేయడానికి ముందు షబ్బీర్ అలీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తో భేటి అయ్యారు.  టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.  హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత షబ్బీర్ అలీ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

“తెలంగాణలో రాజ్యాంగానికి చీకటి దినాలు నడుస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం పని చేస్తుంది. గొర్రెల్ని మేకల్ని కొనట్టు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొంటున్నారు. తెలంగాణలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని టిఆర్ఎస్ కుట్ర పన్నుతుంది. అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రశ్నించే వారు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తాయి. వారికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కానీ ప్రతిపక్షమే లేకుంటే ప్రశ్నించే వారు ఉండరు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలను గొర్రెల లాగా కొంటున్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే ఉల్లంఘిస్తున్నారు. అసలు కాంగ్రెస్ శాసన మండలి పక్షం సమావేశమే కాలేదు. అటువంటప్పుడు కాంగ్రెస్ ఎల్పీ ని టిఆర్ఎస్ ఎల్పీ లో ఎలా విలీనం చేస్తారు. దీని వెనుకు ఏదో కుట్ర దాగి ఉందని అర్ధమవుతోంది.

మాకు శాసనమండలి చైర్మన్, సీఎం కేసీఆర్ లపై నమ్మకం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్దమే. అలా ఎలా చేస్తారు. న్యాయస్థానంలో మేమే గెలుస్తాం. ప్రభుత్వం సరిగా లేదు కాబట్టే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. కోర్టులపై మాకు నమ్మకం ఉంది. టిఆర్ఎస్  ఇప్పటికైన తన దొంగ బుద్దిని మానుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ లపై చర్య తీసుకోవాలి. వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. హైకోర్టులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉంది.” అని షబ్బీర్ అలీ అన్నారు.  

విలీనం చేస్తూ మండలి చైర్మన్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్

 

డిసెంబర్ 21 వ తేది నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ,సంతోష్ కుమార్ లు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసారు.  కాంగ్రెస్ కు శాసన మండలి పక్షానికి కావాల్సిన అర్హత లేదని కాంగ్రెస్ ఎల్పీ ని కూడా టిఆర్ఎస్ లో విలీనం చేయాలని వారు లేఖ అందజేశారు. వారు లేఖ అందజేసిన 24 గంటల్లోనే చైర్మన్ స్వామి గౌడ్ కాంగ్రెస్ ఎల్పీ ని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలు సరిగా లేకనే న్యాయస్థానాలు ఆశ్రయించి న్యాయం పొందుతున్నామన్నారు. న్యాయ స్థానాలే లేకుంటే తెలంగాణ మొత్తం ఆగమయ్యేదని షబ్బీర్ అలీ అన్నారు. 

దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. అలా ఎలా చేస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ పరంగా విలీనం చేయడం తప్పని అందుకే హైకోర్టున ఆశ్రయించామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. ఖచ్చితంగా టిఆర్ఎస్ రివర్స్ షాక్ తగులుతుందని కోర్టులో తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.