కేసీఆర్ పై చొప్పదండి టిఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళిత బిడ్డనని కేసీఆర్ దూరం పెడుతున్నారని ఆమె విమర్శించారు. 18 సంవత్సరాల నుంచి టిఆర్ ఎస్ కోసం పని చేశానని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు దూరం పెట్టాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. 119 స్థానాల్లో 107 స్థానాలే ఎందుకు ప్రకటించారన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లబ్ధి పొందిన వారే ఇప్పుడు దూషణలు చేస్తున్నారన్నారు. తన పై ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే ఊరుకోనని ఆమె హెచ్చరించారు. తాను చొప్పదండి నుంచి పోటి చేస్తానన్నారు. టిఆర్ ఎస్ నుంచి టికెట్ లభించకపోతే స్వతంత్ర అభ్యర్దిగానైనా పోటి చేస్తానని ప్రకటించారు.
బొడిగే శోభకు టికెట్ ఇవ్వవద్దని ఆమెకు టికెట్ ఇస్తే అక్కడ ఓటమి ఖాయమని చొప్పదండికి చెందిన కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ ను కలిసి విన్నవించారు. ఆమె పలుసార్లు వివాదాలలో నిలిచారని వారు కేసీఆర్ కు తెలిపారు. టోల్ గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదం, ఫోన్లలో అధికారులను బెదిరించిన ఆడియోలు వైరల్ గా మారాయి.
2014 ఎన్నికల తర్వాత తొలినాళ్లలోనే బొడిగె శోభ వివాదాల్లో చిక్కున్నారు. వెలమ రావులకే అధికారులు రెస్పెక్ట్ ఇస్తారా?మమ్మల్ని లెక్క చేయరా అంటూ ఆమె కొందరు అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఈ కామెంట్స్ ను కూడా టిఆర్ఎస్ అధినేత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను బొడిగె శోభ బెదిరిస్తున్నారని, పార్టీ నేతలను అవమానకరంగా మాట్లాడుతున్నారని కొందరు నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నేతలను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరో్పించారు.
ఎస్.జి.ఎస్. పేరుతో సొంత సైన్యం స్థాపించుకుని ప్రజలను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి పిలిచినా, గైర్హాజరయ్యారని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, ఆమె భర్త పాల్గొంటే మంత్రి, ఎంపి ముందే అవమానించిన సంఘటనను వివరించారు. పేద ప్రజల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిచండంతో పాటు కేసులు పెట్టినస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు.
వీటన్నింటిని పరిశీలించాకనే కేసీఆర్ ఆమెకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించారని తెలుస్తోంది. ఎంపిపిలు, జడ్పీటిసిలు, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి నేతలంతా ఫిర్యాదు చేయడంతోనే చొప్పదండి పై నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ ఉన్నారని నేతలంటున్నారు.
బొడిగే శోభ పై కావాలనేవ విమర్శలు చేస్తున్నారని, ఉన్నవి లేనివి చెప్పి శోభకు టికెట్ రాకుండా చేశారని శోభ అనుచరులు అంటున్నారు. శోభ మాత్రం ఇప్పటికే టిఆర్ ఎస్ తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకో తీరుగా మలుపు తిరుగుతున్న చొప్పదండి రాజకీయాలపై కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బొడిగ శోభ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

