ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు.. ఈ చిన్న తప్పు చేస్తే ఫలితం శూన్యం..!

ఇల్లు కట్టుకున్నప్పుడు, కొత్త షాప్ ప్రారంభించినప్పుడు, గృహప్రవేశం వంటి శుభకార్యాల ముందు చాలా ఇళ్ల ముందూ ఒకే దృశ్యం కనిపిస్తుంది. గుమ్మం వద్ద వేలాడుతూ కనిపించే బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ, మిర్చి దండలు. ఇది తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. చెడు చూపు, ఈర్ష్య, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా అడ్డుకునే రక్షణ కవచంగా దీనిని భావిస్తారు. మూఢనమ్మకం అనిపించినా… ఈ ఆచారాన్ని ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు విశ్వాసంతో పాటిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లోని వ్యాపార సముదాయాలు, కొత్తగా తెరుచుకునే షోరూమ్‌లు, కార్యాలయాల వద్ద కూడా దిష్టి గుమ్మడికాయ తప్పనిసరిగా కనిపిస్తుంది. పెద్ద సైజులో, గుండ్రంగా ఉండే గుమ్మడికాయను ఎంచుకుని, దానిపై భయానకంగా కనిపించే ముఖాన్ని గీస్తారు. కొన్ని చోట్ల పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, నల్ల దారంతో చుట్టి, నిమ్మకాయలు, పచ్చిమిర్చులతో అలంకరిస్తారు. ఈ రూపం చెడు దృష్టిని తనవైపు ఆకర్షించి, ఇంట్లోకి రాకుండా చేస్తుందని నమ్మకం.

ఇంటి ప్రధాన ద్వారం పైన గుమ్మడికాయను వేలాడదీయడం వెనుక ఒక బలమైన విశ్వాసం ఉంది. ఇంట్లోకి వచ్చే నరదిష్టి, కనుదిష్టి, ఈర్ష్య వంటి ప్రతికూల శక్తులను గుమ్మడికాయ తనలోకి తీసుకుంటుందని, వాటిని బయటే ఆపేస్తుందని అంటారు. అందుకే దీనిని నిర్లక్ష్యంగా కాకుండా, కొన్ని నియమాలతో కట్టాలని పండితులు సూచిస్తారు.

ముఖ్యంగా చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. గుమ్మడికాయను కడగడం. ఇంటి ముందు కట్టేముందు నీళ్లతో కడిగితే దానిలో ఉన్న శక్తి పూర్తిగా నశిస్తుందని నమ్మకం. అందుకే నేరుగా పసుపు, కుంకుమ పెట్టడమే మంచిదని చెబుతారు. అలాగే మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తొడిమతో పట్టుకుని తిరగేసి చూడటం, ఆ తొడిమ ఊడిపోయినా అదే కట్టేయడం కూడా శుభకరం కాదని అంటారు. తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయకు దిష్టి నివారణ శక్తి ఉండదని విశ్వాసం.

ఇంకో ముఖ్యమైన విషయం సమయం. చాలామంది తమకు అనుకూలంగా అనిపించిన సమయంలో గుమ్మడికాయ కడతారు. కానీ సంప్రదాయం ప్రకారం దీనికి ప్రత్యేక కాలం ఉందని చెబుతారు. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే గుమ్మడికాయ కడితే నరదిష్టి, చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. ఒకవేళ అమావాస్య కుదరకపోతే బుధవారం లేదా శనివారం తెల్లవారుజామున కట్టవచ్చని సూచిస్తారు. సూర్యాస్తమయం తర్వాత కట్టితే ఎలాంటి ఫలితం ఉండదని పెద్దలు చెబుతుంటారు.

గుమ్మడికాయ చెడు శక్తులను గ్రహించుకుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంచకూడదు. ప్రతి అమావాస్యకు ఒకసారి కొత్తదాన్ని కట్టి, పాత గుమ్మడికాయను ఇంటికి దూరంగా, నిర్మానుష్య ప్రాంతంలో లేదా ప్రవహించే నీటిలో వదలడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నిలుస్తుందని నమ్మకం. వాస్తు శాస్త్రంలో దీనిపై ప్రత్యక్షంగా ప్రస్తావన లేకపోయినా, ఇది ఒక బలమైన సాంస్కృతిక, జానపద ఆచారంగా గుర్తింపు పొందింది. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, చాలా మందికి ఇది మానసిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చివరికి… విశ్వాసమే బలమైతే, ఆ సంప్రదాయం కూడా జీవితంలో ప్రశాంతతను తీసుకువస్తుందన్నదే చాలామంది నమ్మకం.