కాంగ్రెస్ కు షాక్, టిఆర్ ఎస్ లో చేరనున్న అజారుద్దీన్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్  మాజీ ఎంపి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వబోతున్నారు. ఆయన  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో  చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

పార్టీలో చేరితే ఆయనను లోక్ సభ ఎన్నికల్లో నిలబెటేందుకు టిఆర్ ఎస్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనను టిిపిసిసి వర్కింగ్ ప్రెశిడెంట్ గా నియమించారు. ఆయన కీర్తి ప్రతిష్టలు కాంగ్రెస్ కు పెద్దగా కలసి రాలేదు.అందువల్ల ఇక  కాంగ్రెస్ లో భవిష్యత్తు లేదని ఆయన భావిస్తున్నారట.  తెలంగాణ రాష్ట్ర సమితి ఆయనను సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని దక్కన్ క్రానికల్ రాసింది.

ఈ మేరకు ఈ మధ్య జరిగిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కూతురు పెళ్లిలో ఒక ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఈ పెళ్లిలో ఆయన అసదుద్దీన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారావు, కెసియార్ కూతురు నిజామాబాద్ ఎంపి కవితలను కలుసుకున్నారు.  ఈ సమావేశంలోనే అజార్ ను వారు టిఆర్ ఎస్ లోకి ఆహ్వానించినట్లు, సికిందరాబాద్ లోక్ సభ స్థానం ఆఫర్ చేసినట్లు  వార్తలొస్తున్నాయి.

నిజానికి కాంగ్రెస్ పార్టీ కూ డా ఆయనను లోక్ సభ స్థానానికి నిలబెట్టాలనుకుంది. దీని కోసం మల్కాజ్ గిని స్థానాన్ని ఆఫర్ చేసింది. ఆ రోజు అజార్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అంగీకరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరు చూస్తే మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోలీ చేసినా గెలుపు కష్టం కావచ్చని అజార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటపుడే ఆయనకు టిఆర్ ఎస్ ఆఫర్ లభించింది.టిఆర్ ఎస్ లో  చేరేందుకు అజార్ కు అసదుద్దీన్ సహకరిస్తున్నారని చెబుతున్నారు. అసద్, అజార్ మంచి మిత్రులు కూడా.

అజారుద్దీన్  2009 లో కాంగ్రెస్ చేరారు. ఆ యేడాది ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ కు గెల్చారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో అంత చురుకుగా లేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఆయనను క్రియాశీలం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెశిడెంట్ ను చేసింది.