తెలంగాణలో కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ ఎలాగైతే పెరుగుతున్నాయో ప్రభుత్వం పనితీరు మీద కూడా విమర్శలు అలాగే పెరుగుతున్నాయి. ఇప్పటికే టెస్టుల విషయంలో తెరాస సర్కార్ పూర్తిగా వెనకబడిందనేది వాస్తవం. రోజుకు టెస్టుల సంఖ్య 2000, 3000లకు మించి పెరగడం లేదు. కానీ పాజిటివ్ కేసులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. నిన్న 3188 పరీక్షలకు గాను 546 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో జనంలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరే వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోయినా కనీసం వైరస్ బారినపడిన వారిని కాపాడే వైద్య విధానంలో అయినా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందా అంటే అదీ లేదు.
ప్రధాన ప్రభుత్వ వైద్యశాలన్నీ చేతులెత్తేసిన పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత నానాటికీ తీవ్రతరం అవుతూనే ఉంది. కోవిడ్ చికిత్సకు ప్రధాన వైద్యశాలగా గాంధీ ఆసుపత్రిని సర్కార్ నిర్ణయించింది. కానీ పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనలో మాత్రం విఫలమైంది. ఐసోలేషన్ వార్డుల్లో బెడ్ల కొరత పీడిస్తుంటే ఆక్సీజన్ సిలిండర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. గతంలో వైరస్ బారినపడిన జర్నలిస్ట్ మరణంతో కనీసం తగినన్ని ఆక్సీజన్ సిలీండర్లు అందించే స్థితి కూడా గాంధీలో లేదని బయటపడింది. దీనికి తోడు పీపీఏ కిట్లు, మాస్కులు, భద్రత, సిబ్బంది కొరతతో జూనియర్ డాక్టర్ల నిరసన సైతం ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోంది.
ఇక మరొక ప్రధాన ప్రభుత్వ వైద్యశాల ఉస్మానియా పరిస్థితి కూడా గాంధీకి భిన్నంగా ఏమీ లేదని తాజాగా బయటపడింది. ఉస్మానియా ఐసొలేషన్ వార్డులో 50 మందికి పైగా కోవిడ్ పేషంట్లు ఉంటే కేవలం 24 ఆక్సీజన్ లైన్లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఉస్మానియా బృందం 500 కొత్త ఆక్సీజన్ లైన్లు కావాలని కోరగా ప్రభుత్వం కేవలం 25 లైన్లు మాత్రమే ఏర్పాటు చేసింది. అలాగే ముఖ్యమైన ఆక్సీజన్, బ్లెడ్ ప్రజెర్ చెక్ చేసే మానిటర్లు ఉస్మానియాలో కేవలం 20 ఉన్నాయంతే. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్లు కూడా కేవలం 20 మందే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా అరకొర సదుపాయాలతో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం అసాధ్యం. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ మేలుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడితే మంచిది.