హిమదాస్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మనుషులంతా పరిగెడతారు కానీ లక్ష్యం ఉన్న పరుగు, లక్ష్యాన్ని ఛేదించిన పరుగు, దేశం గర్వపడేలా చేసిన పరుగే అందర్నీ ఆకట్టుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎక్కిరిస్తున్న ఓటమిని పరుగులెత్తించి, తాను విజయంవైపు పరుగెత్తి ప్రపంచ అథ్లెటిక్స్ లో భారతమాతకు స్వర్ణాన్ని బహుమతిగా ఇచ్చింది ‘హిమ దాస్’. ప్రపంచ అథ్లెటిక్స్ లో గెలిచిన గర్వంతో భారత జెండా రెపరెపలాడుతుంటే జాతీయగీతం వింటూ భావోద్వేగానికి లోనయ్యింది, భారతీయులకు గర్వకారణం అయ్యింది. ఆ హిమతేజం ఎవరమ్మాయి? ఎక్కడి నుండి వచ్చింది? పరుగుల రాణిగా ఎలా మారింది? తన గురించి చాలామందికి తెలియని విషయాలతో హిమదాస్ స్పెషల్ స్టోరీ మీకోసం.

బుడి బుడి అడుగులు.., బడిలో మొదలైన పరుగులు

రైతు కుటుంబానికి చెందిన రంజిత్ దాస్, జొమాలి దంపతుల నలుగురు సంతానంలో ఆఖరి సంతానం ‘హిమదాస్’. స్వస్థలం అసోంలోని నాగోన్ జిల్లా, థింగ్ గ్రామం. మొదట్లో హిమ ఫుట్ బాల్ ప్లేయర్. మైదానంలో తన పరుగు చూసి పాఠశాలలోని కోచ్ శ్యాంసోల్ ఆమెకు ఫుట్ బాల్ కంటే అథ్లెటిక్స్ సరైందని సూచించాడు. అప్పటి నుండి ఫుట్ బాల్ వదిలి అథ్లెటిక్స్ లో శిక్షణ పొందటం ప్రారంభించింది హిమ. కనీసం బూట్లు కూడా లేకుండా పొలాల్లో పరిగెత్తడం ప్రారంభించింది. గాయాలు అవుతున్న లెక్క చేయని మొండి పట్టుదలే ఆమెలోని ఛాంపియన్ బయటకు వచ్చేలా చేసింది.

విజయానికి బీజం ఆత్మవిశ్వాసం అని నిరూపించింది

ప్రొఫెషనల్స్ శిక్షణ లేకుండా.. పొలాల్లో రెండు నెలలపాటు ఒంటరిగా పరుగుపై చేసిన సాధనతో… గువహటిలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో 100 మీ విభాగంలో పాల్గొని కాంస్యం గెలిచింది. ఎటువంటి శిక్షణ లేకుండా ఆత్మవిశ్వాసంతో సాధించిన విజయమది. 2016, కోయంబత్తూర్ లో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ లో పాల్గొనింది. ఆ పోటీలో కాంస్యం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

మలుపు తిప్పిన కోచ్ నిపాన్ ప్రోత్సాహం

మెరుపులా పరుగెత్తడం తప్ప ఎటువంటి బూట్లు వేసుకోవాలో కూడా తెలియదు హిమకి. ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలో కూడా తెలియదు. ఎలా సాధన చేయాలో తెలియదు. ఎంత నైపుణ్యం ఉన్నా ప్రొఫెషనల్ శిక్షణ లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో కోచ్ నిపాన్ ఆమెను గైడ్ చేసాడు. తనని గువహటిలోని స్పోర్ట్స్ అండర్ యూత్ వెల్ఫేర్ సెంటర్లో చేర్పించాడు. కేవలం ఫుట్ బాల్, బాక్సింగ్ కోసమే శిక్షణ ఇచ్చే ఆ సెంటర్లో ప్రత్యేకంగా హిమ కోసం ఒక గది తీసుకుని అక్కడే ట్రాక్ లో శిక్షణ ఇప్పించాడు. ఆ మలుపు ఆమె పరుగులో ఎంతో మార్పు తీసుకొచ్చింది.

2017 లో చెన్నైలో జరిగిన ఇండియన్ ఓపెన్లో 200 మీ పరుగులో హిమ స్వర్ణం గెలిచింది. ఈ ఏడాది ఫెడరేషన్ కప్ లో 400 మీ విభాగంలో పాల్గొని బంగారు పతకం గెలిచి గోల్డ్‌కోస్ట్ కామ‌న్వెల్త్‌ క్రీడలకు ఎంపికైంది. ఆ క్రీడల్లో 400 మీ పరుగులో 51.32 సెకన్లలో వ్యక్తిగత ఉత్తమ టైమింగ్ నమోదు చేసింది కానీ ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

‘హిమ స్వర్ణం తెస్తుంది’ అని అందరికీ నమ్మకం కల్గించిన హిమ టైమింగ్

అండర్-20 వరల్డ్ ఛాంపియ‌న్‌షిప్‌కు ముందు అంతర్ రాష్ట్ర ఛాంపియ‌న్‌షిప్‌లో 200 మీ పరుగులో అత్యుత్తమ టైమింగ్ 51.13 సెకెన్లతో పసిడి గెలిచింది. ఈ టైమింగ్ వలనే ట్రాక్ ఈవెంట్ లో స్వర్ణం తెస్తుంది అని తనపై అందరికీ నమ్మకం కలిగింది. అందరి నమ్మకాన్ని నిజం చేస్తూ ‘ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ వరల్డ్ అండర్-20 లో స్వర్ణం గెలిచిన భారతీయ ప్రధమ మహిళగా’ చరిత్ర సృష్టించింది. 400 మీ పరుగులో 51.46 సెకన్లలో స్వర్ణం గెలిచి ఛాంపియ‌న్‌షిప్‌లో జాతీయ గీతం వినిపించేలా చేసింది. పోటీకి ముందు కోచ్ నిపాన్ దాస్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటోంది.