ఎన్నికల మూడ్: టీడీపీకి షాకిచ్చేసిన వైసీపీ

రెండున్నరేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తమవ్వాల్సిందిగా మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో దిశా నిర్దేశం చేశారన్న ఓ గాసిప్, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసింది. ‘సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికీ గురి కాకూడదు. వారిలో ఎలాంటి అసహనం వుండకూడదు..’ అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి స్పష్టం చేయడం మామూలే. అయితే, అది ఎన్నికల్ని లక్షంగా చేసుకుని.. అంటూ జరుగుతున్న ప్రచారంతో టీడీపీ కంగారుపడక తప్పలేదు. ఇప్పుడేంటి.? ఎన్నికల హంగామా మొదలు పెట్టేయడమేంటి.? అంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది. టీడీపీ పైకి ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా, ఆ పార్టీ తాజా పరిస్థితి ఏంటన్నది అందరికీ అర్థమవుతూనే వుంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, టీడీపీకి అభ్యర్థు దొరకడం కష్టం. ఆ సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో మధ్యంతర లేదా ముందస్తు ఎన్నికలు వచ్చేు పరిస్థితులే లేవు. అయినాగానీ, టీడీపీని ఒకింత గందరగోళంలోకి నెట్టేయడానికి వైఎస్ జగన్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేశారన్న విషయం సుస్పష్టమవుతోంది. మరోపక్క, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏంటి పరిస్థితి.? అన్నదానిపై టీడీపీలో మల్లగుల్లాలు షురూ అయ్యాయి. ‘మేం సంసిద్ధంగా వున్నాం.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా వున్నారు..’ అని వైసీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాగా, ఎన్నికలకోసం సమాయత్తమవ్వాల్సిందిగా వైఎస్ జగన్, మంత్రులకు సూచించారన్న ప్రచారంతో కొంత మేర వైసీపీ శ్రేణుల్లోనూ అలజడి షురూ అయ్యింది. మంత్రి వర్గంలోకి కొత్తవారిని తీసుకోవడం సంగతేంటి.? అన్న చర్చ సహా, చాలా విషయాలపై వైసీపీలో హాటు హాటు చర్చలు జరుగుతున్నాయట.