భారతీయ జనతా పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి అవసరం అయినప్పుడు వైసీపీ, రాష్ట్రంలో వైసీపీకి అవసరం అయినప్పుడు బీజేపీ సహకరించుకుంటున్నాయి. మిత్ర పక్షాలు తప్ప మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీని దాదాపు అన్ని విషయాల్లోనూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడిన వైసీపీ సర్కార్ మాత్రం ప్రతి దశలోనూ ఎన్డీయేకు సహకారం అందిస్తూనే ఉంది. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి మద్దతు పలకడం, కొత్త విద్యుత్ బిల్లు విషయంలో సైతం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నడవడం వంటివి చేసింది. ఇక బీజేపీ కూడ వైసీపీకి కీలక విషయాల్లో సహకరిస్తోంది.
ప్రధానంగా మూడు రాజధానుల అంశంలో కేంద్ర ప్రభుత్వం మౌనంగా పక్కకు తొలగి రాజధాని ఏర్పాటులో తాము జోక్యం చేసుకోమని చెప్పింది. ఈ పరిణామంతో వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. అధికారిక పొత్తులో ఉన్న రెండు పార్టీలు కూడ సహకరించుకోనంత చక్కగా ఈ రెండు పార్టీలు సహకరించుకుంటుండటంతో కొంపదీసి వైసీపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా మారిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వైసీపీ మాత్రం తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, బీజేపీతో ఎలాంటి పొత్తూ లేదని వాదిస్తూ వస్తోంది. ఈలోపు వారి నడుమ ఉన్న రహస్య స్నేహం బయటపడేలా ఇంకో సంఘటన జరిగింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపికలో వైసీపీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు పలికింది. ఎన్డీయే అభ్యర్థిగా నిలబడిన జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ నిలబడ్డారు. ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఘాను ప్రతిపాదించాయి. వైసీపీకి ఉన్న ఆరుగురు సభ్యులు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరొకవైపు గతంలో అన్ని విషయాల్లో ఎన్డీయే నిర్ణయాలను బలపరుస్తూ వచ్చిన తెరాస మాత్రం ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయేకు మద్దతు ఇవ్వలేదు. తాము ఎన్డీయే లేదా యూపీయే కూటముల్లో భాగం కాదు కాబట్టి ఎవ్వరికీ మద్దతు పలకమని, ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించింది. టీఆర్ఎస్ మాటల ప్రకారం చూస్తే ఎన్డీయే అభ్యర్థిని బలపరిచింది కాబట్టి వైసీపీ ఎన్డీయేలో చేరిపోయిందా లేకపోతే భవిష్యత్తులో చేరుతుందనడానికి ఇది సంకేతమని అనుకోవాలో మరి.