వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏం తేలబోతోంది.?

రోజులు, నెలలు, ఏళ్ళు గడుస్తోంది.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలడంలేదు. రాష్ట్ర పోలీస్ విచారణలో ఏమీ తేలలేదు.. సీబీఐ విచారణతో అయినా ఏమన్నా తేలుతుందో లేదో తెలియని పరిస్థితి. న్యాయం కోసం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎంత పోరాటం చేస్తున్నా.. ఈ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది.

వైఎస్ వివేకా కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతోనే కేసు విచారణ సీబీఐ చేతికి వచ్చింది. కరోనా నేపథ్యంలో కేసు విచారణలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. తాజాగా సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీటుని దాఖలు చేసింది.

కొందర్ని అరెస్టు చేసిన వైనం, చాలామందిని విచారించిన వైనం.. వీటన్నిటినీ చార్జిషీటులో సీబీఐ ప్రస్తావించింది. అయితే, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు ఎందుకు చంపారో మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. అది 2019 ఎన్నికల సమయం. వైసీపీ తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి. కానీ, రాత్రి వేళ ఇంటి వద్ద వైఎస్ వివేకానందరెడ్డికి ఎవరూ సాయంగా వుండకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది.

మాజీ మంత్రి, మాజీ ఎంపీ హత్యకు గురైతే.. అదీ అత్యంత కిరాతకంగా ఓ మాజీ ప్రజా ప్రతినిథిని హత్య చేస్తే.. అందునా, రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే.. ఈ కేసులో ఇప్పటికీ నిజాలు నిగ్గు తేలకపోవడం ఆశ్చర్యకమే.

ఏ గొడవలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారి తీశాయన్నదీ ఇప్పటిదాకా తేలకపోవడం మరింత ఆశ్చర్యంగొలిపే విషయం. తొలుత గుండెపోటుగా ప్రచారం జరిగినా, అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు గొడ్డలితో నరికి చంపిన వైనం బయటపడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. కేసు విచారణ కొన’సాగు’తూనే వున్న దరిమిలా, దోషులెవరో ఎప్పటికి తేలుతుందో ఏమో.