ఆ నేతలను ఓడిస్తే మంత్రి పదవి..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కంటే ఇతర పార్టీల ముఖ్య నేతలు ఓడిపోవటంపై శ్రద్ధ పెడుతున్నారు. తాజాగా జగన్ కుప్పం వైసీపీ కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించడం గమనార్హం. భరత్ ను గెలిపిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు.

సాధారణంగా అభ్యర్థిని ప్రకటించడం తప్ప అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని జగన్ స్థాయి నేతలు వెల్లడించడం అరుదుగా జరుగుతుంది. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ ఈ తరహా ప్రకటనలు చేయడం గమనార్హం. కుప్పంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ స్థాయి సమీక్షలలోనే ఎమ్మెల్యే అభ్యర్థిని సైతం జగన్ ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.

2019 ఎన్నికల్లో జగన్ చేసిన ప్రయత్నాల వల్ల కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గిందనే సంగతి తెలిసిందే. కుప్పంను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ నేతలకు షాకిస్తుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం కుప్పం నుంచి ప్రముఖ నటుడు విశాల్ పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

అటు వైసీపీ నేతలు ఇటు విశాల్ వైరల్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. పవన్ ను ఓడించినా, ఇతర టీడీపీ ముఖ్య నేతలను ఓడించినా మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ వాళ్లకు మొండిచెయ్యి చూపారు. ఈసారి అయినా సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.