High Court : హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నిస్తుందా.?

High Court : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో, శాసన సభ సాక్షిగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలని కోరారు. ప్రజలు ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిథుల్ని చట్ట సభలకు పంపేది చట్టాలు చేయడం కోసమేననీ, శాసన సభకు చట్టాలు చేసే అధికారం లేదని న్యాయస్థానాలు వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు.? అన్నదానిపై చర్చ జరిగి తీరాల్సిందేనని ధర్మాన, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిజానికి, ధర్మాన ప్రసాదరావు పెద్ద సాహసమే చేసినట్టు లెక్క. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్ని ‘సవాల్’ చేయడానికి వుంది తప్ప, ఆ తీర్పులపై వక్రభాష్యాలు చెప్పడమో, తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో సబబు కాదు.. అది కోర్టు ధిక్కరణ కూడా అవుతుంది.

అయితే, చట్ట సభల్లో ఏ అంశంపైన అయినా చర్చించడానికి వీలవుతుందన్నది కొందరి వాదన. చట్టాలు చేసేది చట్ట సభలు, ఆ చట్టాలు సరిగ్గా అమలు కాలేదని ఎవరైనా న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే.. వాటికి అనుగుణంగా స్పందించి, తీర్పులు చెప్పడం న్యాయస్థానాల బాధ్యత.

ఇక్కడ, ఇప్పుడు.. అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు పెడార్ధాలు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని అంశంపై స్పష్టత వచ్చిందనీ, ఒకవేళ రాజధానిని మార్చాలన్నా, మూడు రాజధానులు చేయాలన్నా మళ్ళీ పార్లమెంటులోనే చట్టానికి సవరణలు చేయాలనీ అంతే తప్ప రాష్ట్రంలోని శాసన వ్యవస్థ ఆ మార్పులు చేయలేదని హైకోర్టు పేర్కొంది.

సరే, వైఎస్ జగన్ సర్కారు, మూడు రాజధానుల గురించి చేస్తున్న ఆలోచన మంచిదా.? చెడ్డదా.? అన్నది వేరే చర్చ. వ్యవస్థల మీద దాడి.. అన్నట్టుగా అధికార పార్టీ నాయకులు మాట్లాడితే, అంతిమంగా ప్రజల్లో వైసీపీనే చులకనైపోతుంది.

సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం వున్నప్పుడు.. చట్ట సభల్లో చర్చించి ఏం లాభం.? అన్నది గతంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకే తెలియాలి.