చంద్రబాబూ.. ఆ ఒక్కటీ చెప్పరెందుకని.?

‘ఔను, మా పార్టీ నేతలు తప్పు చేశారు. తప్పుడు మాటలు మాట్లాడారు..’ అన్న ఒక్క మాటా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి రావడంలేదు. రాజకీయాల్లో హుందాతనం అవసరం. ఆ హుందాతనం గురించి చాలా ఎక్కువ మాట్లాడే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇప్పుడెందుకు హుందాతనం ప్రదర్శించడంలేదు.?

పట్టభి వ్యాఖ్యల కంటే ముందు, అయ్యన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద. అయ్యన్న విషయంలోనే చంద్రబాబు, ‘అదుపు’ వ్యాఖ్యలు చేసి వుండాలి. అయ్యన్నను అదుపులో పెట్టి వుంటే, ఇప్పుడు పట్టాభి వ్యవహారం దాకా వచ్చి వుండేది కాదు.

వైసీపీ శ్రేణులు, టీడీపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరు. సమర్థించకూడదు కూడా. ఎందుకంటే, ఈ రోజు వైసీపీ.. రేపు టీడీపీ.. ఎవరు అధికారంలో వుంటే వాళ్ళు.. తమకు తోచిన విధంగా దాడులకు దిగుతామంటే కుదరదు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం, పార్టీ శ్రేణుల్ని అదుపులో పెట్టాల్సి వుంటుంది. అయ్యన్న పాత్రుడు, పట్టాభి.. తరహాలోనే వైసీపీలో డజన్ల కొద్దీ నేతలు బూతులు మాట్లాడేస్తున్నారు. వారిని నియంత్రించలేని అసమర్థత ముఖ్యమంత్రిదా.? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి.

ఇదిలా వుంటే, టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని వీలైనంత పెద్దదిగా చూపి రాజకీయ లబ్ది పొందాలనే యత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీన్నొక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే, బూతులపై చర్చకు సిద్ధమా.? అంటూ టీడీపీ నేతలు, వైసీపీకి సవాల్ విసురుతున్నారు.

అయ్యిందేదో అయిపోయింది.. ఇకపై రాజకీయాల్లో ఇలాంటి బూతుల వ్యవహారాలు, దాడుల వ్యవహారాలు లేకుండా ఏం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి వస్తే, ఆ దిశగా ఆయన అడుగులేస్తే.. అప్పుడు కదా, చంద్రబాబు హుందాతనం కలిగిన నాయకుడని అనుకుంటారెవరైనా. కానీ, అంతటి హుందాతనం ఆయన్నుంచి ఆశించలేం.