అంతిమంగా వినియోగదారుడు తన వాహనంలో పెట్రోలు లేదా డీజిల్ కొట్టించుకోవాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో, దేశానికి ఈ పెట్రో ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోతున్నాయి. అదేంటీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు లభ్యత ఇబ్బందికరంగా మారింది కదా.. మరి, అలాంటప్పుడు ఇటు రాష్ట్రాలూ, అటు కేంద్రం ఎలా పండగ చేసుకుంటోంది.? అంటే, అదే అసలు మతలబు. రైల్వే కోసం పన్నులు తగ్గించి పెట్రో ఉత్పత్తుల్ని అందించొచ్చు.. రాష్ట్రాల్లోనూ ప్రజా రవాణా కోసం పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించొచ్చు. కానీ, అలాంటి మంచి పనులేవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు. ఎందుకంటే అదంతే. ‘పెట్రో ఉత్పత్తుల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి..’ అన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ‘మాకేమీ అభ్యంతరం లేదు’ అని అంటుంది కేంద్రం. కానీ, రాష్ట్రాలే ఒప్పుకోవడంలేదట. రాష్ట్రాలు వద్దంటోన్న పనులు చాలానే చేస్తోంది కేంద్రం. కరోనా మహమ్మారి దేశంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న రోజులవి. అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేస్తే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సూచిస్తే, కేంద్రం లైట్ తీసుకుంది.
పెద్ద నోట్ల రద్దు విషయంలో ఏం జరిగిందో చూశాం. రాష్ట్రాలను అడిగి ఆ పని చక్కబెట్టారా.? ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏం చేస్తోంది.? చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. ఆయా సందర్భాల్లో కనీసం రాష్ట్రాల విజ్ఞప్తుల్నీ పట్టించుకోని కేంద్రం, పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు మాత్రం, రాష్ట్రాలు ఒప్పుకోవడంలేదని తేల్చేసింది. నిజమే, అటు కేంద్రం వాత.. ఇటు రాష్ట్రాల వాత.. వెరసి, సామాన్యడు చావలేక బతుకుతున్నాడు పెట్రో ధరల పుణ్యమా అని. ఉప్పు, పప్పు.. అన్ని ధరలూ పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగదల కారణంగా భయపెడుతున్నాయి. ఈ సమయంలో జెట్ ఫ్యూయల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం అనుకుంటోందట. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది పరిస్థితి. ‘మేమే కాదు, రాష్ట్రాలు కూడా బాగానే పండగ చేసుకుంటున్నాయ్..’ అని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు, పెట్రో బాదుడుపై వ్యాఖ్యానించడమంటే.. ప్రజల్ని ఎలా రాష్ట్రం, కేంద్రం వేధిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.