ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరుస గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వరుసగా నిధులు అందుతున్నాయి. ఎన్నికలకు సిద్దం ఇందులో భాగంగా… దేశ వ్యాప్తంగా ఈ సారి వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగిన నేపథ్యంలో జూన్ నెలలో రై 1,61,497 కోట్లు వసూలయినట్లు కేంద్ర ఆర్దిక శాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రాల వాటాను తాజాగా కేంద్రం ప్రకటించింది.
ఇందులో భాగంగా… జూన్ నెల వసూళ్ల ప్రకారం ఏపీకి రూ 1,159.88 కోట్ల మేర వాటాగా నిధులు దక్కనున్నాయి. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్దిక సంవత్సరంలో రుణ పరిమితి, రెవిన్యూ లోటు నిధులు, కేంద్రం – రాష్ట్రం పన్నుల వాటాలో రావాల్సిన నిధులు, ఇలా వరుసగా ఏపీకి నిధులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జీఎస్టీ సొమ్ము కూడా ఏపీకి రానుంది.
సరిగ్గా ఆరేళ్ల క్రితం జీఎస్టీ విధానం మొదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి నెలా కోట్లాది రూపాయలు వసూళు అవుతున్నాయి. ఇందులో భాగంగా గత ఏడాది ఏపీలో రూ 2,986.52 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది జూన్ లో రూ 3,477.42 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. అంటే… ఇది గత ఏడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువన్నమాట.
ఇక దేశవ్యాప్తంగా గత నెలలో ఏకంగా 1.61 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది గత ఏడాది వసూళ్లతో పోల్చితే 11.7 శాతం ఎక్కువ కాగా… గత నెల వసూళ్లతో పోల్చితే 2.8 శాతం అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో… గత నాలుగైదు నెలలుగా ప్రతి నెలా సరాసరిన కేంద్రానికి 1.5 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు వస్తున్నాయి.