కుప్పంలో ఓడితే చంద్రబాబు పరిస్థితేంటి.?

ఇది 2024 ఎన్నికల నాటి అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కాదు. ఇప్పుడు జరుగుతున్న కుప్పం మునిసిపల్ ఎన్నికల పందేరం. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి దిమ్మ తిరిగే షాకిచ్చింది అధికార వైసీపీ. అయినాగానీ, చంద్రబాబు హంగామా కొనసాగుతూనే వుంది. మేకపోతు గాంభీర్యం టీడీపీ ప్రదర్శిస్తూనే వుంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టేందుకు అధికార వైసీపీ సర్వసన్నద్ధమైంది. ఏ చిన్న అవకాశాన్నీ వైసీపీ వదలడంలేదు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు చాలామంది కుప్పంలో మోహరించారు.

మరోపక్క, టీడీపీకి చెందిన నేతలు సైతం కుప్పంలో మకాం వేశారు. అయితే, కుప్పంలో టీడీపీ నేతలకు అడుగడుగునా పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురవుతున్నాయి. పోలీసుల అభ్యంతరాలతో టీడీపీ చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై పోలీసులు మరింత గుస్సా అవుతున్నారు.

కుప్పం కేంద్రంగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నది చంద్రబాబు ఆరోపణ. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో అక్రమాలకు వైసీపీ తెరలేపిందనీ, బెదిరింపులతో అటు నాయకుల్ని, ఇటు ఓటర్లను లోబర్చుకుంటున్నారనీ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు.

స్థానిక ఎన్నికలంటేనే అధికార పార్టీకి అత్యద్భుతమైన అడ్వాంటేజ్ వుంటుందని చంద్రబాబుకి తెలియదా.? గతంలో చంద్రబాబు ఇలాంటి ఎన్నికలనగానే ఎంత ఓవరాక్షన్ చేశారో, చేయించారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇంతకీ, కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓడితే చంద్రబాబు పరిస్థితేంటి.? ఇంకేముంది.. రాజకీయ సన్యాసమేనన్నది వైసీపీ జోస్యం.