ప్రభుత్వాలకు ప్రజలు చలాన్లు విధించే రోజెప్పుడొస్తుందో.!

రాంగ్ సైడ్ డ్రైవింగా.? అయితే, చలానా కట్టాల్సిందే. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదా.? సిగ్నల్ జంపింగ్ దగ్గర్నుంచి, అన్నిటికీ చలాన్లు కట్టించాల్సిందే. ట్రాఫిక్ పోలీసులు ముక్కు పిండి మరీ చలాన్లు వసూలు చేస్తున్నారు. నిజానికి, ట్రాఫిక్ విభాగంలోని పెద్దలు, నెలవారీ డెడ్‌లైన్లు పెట్టి మరీ.. చలాన్ల వసూళ్ళలో నిమగ్నమైపోయారన్న విమర్శలు ఈనాటివి కావు. అయితే, ట్రాఫిక్ పరంగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, వాహనదారుల, ప్రజల భద్రత కోసమేనని మనమంతా గుర్తించాలి. ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తే, చాలానా కట్టే పనేముంటుంది.? సరే, ఇక్కడి వరకూ ట్రాఫిక్ విభాగాన్ని తప్పు పట్టలేం. కానీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు అధికారులెందుకు అందుబాటులో వుండరు.? అరగంటలో గమ్యం చేరుకోవాల్సి వున్నా, రెండు మూడు గంటల సమయం ఎందుకు పడుతుంటుంది.? మరి, ఈ సమస్యకు బాధ్యులెవరు.? ఎవరికి మనం చలాన్లు విధించాలి.? ఈ ప్రశ్న వాహనదారుల్లో కలగడం సహజమే. రోడ్ల మీద గుంతల్ని అధికారులు పట్టించుకోరు. ఫుట్ పాత్‌ల మీద ఆక్రమణల్నీ అధికారులు పట్టించుకోరు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు సకాలంలో నిర్మితం కావు.

చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే సమస్యలుంటాయి. వాటి విషయంలో ఎవరికి జరీమానాలు విధించాలి.? అన్న ఆవేదన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. చలాన్లు అన్నీ వాహనదారుల్ని సంస్కరించడానికే.. అనుకుంటే పొరపాటేననీ, కేవలం టార్గెట్లను రీచ్ అవడం కోసం అడ్డగోలు నిబంధనలు తెచ్చి, అధికారులు దోచేస్తున్నారనీ వాహనదారులు వాపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. తమకు సంబంధం లేకుండా చలానాలు వస్తున్న ఘటనలూ అడపా దడపా కనిపిస్తున్నాయి చాలామందికి. కొందరైతే, ట్రాఫిక్ విభాగానికి ఫిర్యాదు చేసి, సమస్యను పరిష్కరించుకుంటున్నా.. చాలామంది, మనకెందుకు తలనొప్పి.. అని సైలెంటుగా చలాన్లు కట్టేస్తున్నారట. రహదార్లపై ప్రమాదాలు నివారించడానికి నిబంధనల్ని ఎంత కఠినతరం చేసినా తప్పు లేదుగానీ, వాహనదారుల్ని దోచేసేలా చలాన్ల వ్యవహారం వుంటుండడం పట్ల అభ్యంతరాలు తరచూ వ్యక్తమవుతూనే వుంటాయి. అసలే కరోనా కష్ట కాలం.. ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనదారుల్ని మరింతగా వేధించడం ఎంతవరకు సబబు.? అన్నది మెజార్టీ వాహనదారుల ఆవేదన.