Tollywood : వైజాగ్, తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్త డెస్టినేషన్.?

Tollywood : ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం. హైద్రాబాద్ తరహా ట్రెండీ కల్చర్ కూడా విశాఖలో కనిపిస్తుంటుంది. హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయిలో భిన్నత్వం విశాఖపట్నంలో చూడొచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు విశాఖలో వుండడం వల్ల (జాతీయ సంస్థల కారణంగా) విశాఖకు ఆ ప్రత్యేకత వచ్చింది.

మరి, తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్ తర్వాత తమకు మరో డెస్టినేషన్‌గా విశాఖపట్నంను ఎందుకు ఎంచుకోకూడదు.? నిజానికి, ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం వున్నప్పుడే ప్రముఖ నిర్మాత రామానాయుడు, విశాఖలో స్టూడియో కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే, కాలక్రమంలో అనుకున్న స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.

తరచూ విశాఖ రామానాయుడు స్టూడియో వివాదాల్లోకెక్కుతుంటుందనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తెలుగు సినీ పరిశ్రమకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.. విశాఖ విషయమై. విశాఖలో స్టూడియోలు పెట్టుకుంటే, వారికి ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయమంతా చేస్తామన్నారు సీఎం జగన్.

ఇళ్ళ స్థలాల్ని కూడా ఇస్తామనీ, జూబ్లీహిల్స్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమ కోసం ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనీ వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి చర్చ జరిగినా, విశాఖ విషయమై చంద్రబాబు అంతగా ఆసక్తి చూపలేదు. అమరావతిలోనే సినీ పరిశ్రమకి కూడా చోటు కల్పిస్తామంటూ కేవలం పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమయ్యారు చంద్రబాబు.

ఇక, వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు వైజాగ్ ఓ అద్భుతమైన డెస్టినేషన్ అనే ఆలోచనతో వున్నాగానీ, హైద్రాబాద్‌లో స్థిరపడ్డ పరిశ్రమ, అక్కడి నుంచి కదిలి వెళ్ళడం అంత తేలిక కాదు.