ఉమ్మడి తెలుగు రాష్టానికి హైద్రాబాద్ రాజధానిగా వుండేది. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక కూడా హైద్రాబాద్.. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. ఇంకో రెండున్నరేళ్ళపాటు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా వుంటుంది. ఇది వాస్తవం.
కానీ, ఎప్పుడైతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యిందో, హైద్రాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ ‘ఉమ్మడి’ హక్కుని కోల్పోయినట్లే. సరే, ఎన్నాళ్ళని కొత్త రాష్ట్రం రాజధాని లేకుండా కేవలం ఉమ్మడి రాజధానితో నెట్టుకొస్తుంది.? అందుకే, అమరావతి రాజధాని అనగానే.. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రాలేదు.
కానీ, ఆ అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నానా రకాల పబ్లిసిటీ స్టంట్లూ చేసింది. భూ సమీకరణ దగ్గర్నుంచి, తాత్కాలిక సచివాలయ నిర్మాణం వరకు.. తలెత్తిన వివాదాల నేపథ్యంలో అమరావతి ఓ మిధ్య.. అనే భావన జనంలోకి వెళ్ళిపోయింది.
ఎప్పుడైతే వైఎస్ జగన్ సర్కార్.. మూడు రాజధానులని ప్రకటించిందో.. మళ్ళీ రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇక్కడ మూడు రాజధానుల్లో విశాఖకు అగ్రపీఠం వేశారు. విశాఖ పెద్ద నగరం గనుక, ఆ నగరానికి అదనపు హంగులు పెద్దగా సమకూర్చాల్సిన అవసరం లేకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా దక్కే అవకాశం వుంది గనుక.. ‘హమ్మయ్య..’ అనుకున్నారు చాలామంది.
కానీ, నానా రకాల న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో మూడు రాజధానుల వ్యవహారం అటకెక్కింది. ఇక్కడ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే, అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం. తక్కువ ఖర్చుతో.. నిర్మాణ పనులు కొనసాగిస్తే.. అసలు సమస్యే వచ్చి వుండేది కాదు.
ఇక, ఇప్పుడు మూడు రాజధానులనేది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కొత్త బిల్లు తెచ్చినా ఉపయోగం వుండకపోవచ్చు. ఎందుకంటే, అంతలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది గనుక. రోడ్ల గుంతల పూడ్చివేతకే అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి పట్టిందంటే, మూడు రాజధానులెలా సాధ్యం.?