జగన్ సర్కార్ కు చేటు చేస్తున్న వైసీపీ నేతలు.. అదే రాజధాని అంటూ?

వైసీపీ నేతలు కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో చెప్పలేం కానీ వాళ్లు మాట్లాడే మాటలు పార్టీకి చేస్తున్న చేటు అంతాఇంతా కాదు. జగన్ సర్కార్ మూడు రాజధానులు అని చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నా విశాఖ నుంచి పాలన ఉంటుందని చెబుతోంది. అదే సమయంలో అమరావతి, కర్నూలు ప్రాంతాలలో మరింత అభివృద్ధి జరిగే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయాలని భావిస్తోంది.

అయితే వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మాట్లడుతూ ప్రతి సందర్భంలో మూడు రాజధానులు అని చెప్పాల్సిన అవసరం లేదని విశాఖను మాత్రమే రాజధాని అనుకుంటే చాలని కామెంట్లు చేశారు. అమరావతి శాసన సంబంధిత వ్యవహారాలు, కర్నూలులో న్యాయ సంబంధమైన వ్యవహారాలు జరుగుతాయని ఏపీకి ముఖ్యమైన రాజధాని విశాఖ మాత్రమే కనుక విశాఖనే రాజధానిగా భావించాలని ఆయన కామెంట్లు చేశారు.

జగన్ సర్కార్ పై ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యతిరేకత కలిగేలా కొంతమంది వైసీపీ నేతల కామెంట్లు ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు విశాఖలో భూములు కలిగి ఉన్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నేతలు ఈ వార్తల్లో నిజం లేదని చెబుతున్నా సాక్ష్యాలు భిన్నంగా ఉండటంతో ఈ వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది.

ఈ తరహా కామెంట్లు చేసే నేతల విషయంలో జగన్ సర్కార్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. జగన్ సర్కార్ మూడు రాజధానులకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించినా సమస్య తేలికగా పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు, జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో నేతలు స్పందించే విషయంలో ఆచితూచి వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.