సంచనలాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ ఆయన. కానీ, అది ఒకప్పుడు. గత కొంతకాలంగా ఆయన వివాదాలతో సావాసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు సినిమాలూ చేస్తున్నారు. వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా ఆడటంలేదు. కానీ, వర్మ ఏదన్నా సినిమా చేస్తున్నాడంటే, దాని చుట్టూ బోల్డంత హైప్ జనరేట్ చేయగలడు.!
అలాంటి రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు తాజాగా. ఏంటీ, వర్మగానీ రాజకీయాల్లోకి వస్తన్నాడా.? అసెంబ్లీ లేదా పార్లమెంటుకు ఆయనేమన్నా పోటీ చేస్తాడా.? ఇవేవీ కాదు, నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఆశిస్తున్నాడా.? ఇలా బోల్డన్ని ఊహాగానాలు తెరపైకి రావడం సహజమే.
కానీ, సినిమా విషయమై ఆర్జీవీ, వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారట. అది కూడా ‘జగన్నాథ రథ చక్రాల్’ అనే టైటిల్‌తో తెరకెక్కించబోయే వైసీపీ అనుకూల సినిమా అని ప్రచారం జరుగుతోంది. అదొక్కటే కాదు, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట వర్మ. దీనికి ‘దత్త పుత్రుడు’ అనే టైటిల్ పెట్టబోతున్నారట. ఈ రెండిటితోపాటు, ‘దుష్ట చతుష్టయం’ అనే ఇంకో సినిమా ఆలోచన కూడా వర్మకి వుందట.
ఇవన్నీ నిజానికి వర్మ ఆలోచనలు కాదు, వైసీపీ ఆలోచనలు. ఆ ఆలోచనలకు అనుగుణంగా వర్మ అన్నీ పక్కాగా ప్రిపేర్ చేసుకుని, ప్రతిపాదనల్ని వైసీపీ అధినేత ముందర వుంచారన్నది ప్రచారంలో వున్న ఊహాగానాల సారాంశం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకుంటే పెద్ద పెద్ద దర్శకులే, ఆయనకు అనుకూలంగా సినిమాలు తీసేందుకు ముందుకొస్తారు. కానీ, సినిమాలో కంటెంట్ వున్నా లేకపోయినా దాన్ని జనంలో చర్చనీయాంశంగా మలచడంలో వర్మకి సాటి ఇంకెవరూ రారు. అద్గదీ అసలు సంగతి.