మెగా బ్రదర్ నాగబాబు కామెంట్లు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపికే. ఫైర్ ఈజ్ ఫైర్…ఐయామ్ ది ఫైర్ అన్నట్లు మెగా బ్రదర్ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. మెగా ఫ్యామిలీని ఎవరేమన్నా ముందుగా ఆయనే సీన్ లోకి ఎంటర్ అయి చెడుగుడు ఆడుకుంటారు. ఇటీవలే సినీ పెద్దలు కేసీఆర్ తో భేటీ అయిన నేపథ్యంలో భూములు పంచుకోవడానికే అయి ఉంటుందని బాలయ్య నోరు జారిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి ఉండటంతో నాగబాబు బాలయ్యపై ఒంటికాలుపై లేచి విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగానే బాలయ్యను హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బాలయ్యపై మండిపడ్డారు. కేవలం తన అన్నయ్య చిరంజీవిని అన్నందుకే ఆయన అంతగా రియాక్ట్ అయ్యారు. మరి ఆ ప్రభావమో లేక! నిజంగా ఏపీలో టీడీపీ భవిష్యత్ ఊహించో తెలియదు గానీ ఈసారి ఏకంగా వచ్చే ఎన్నికల సమయానికి ఏపీలో రెండు రాజకీయ పార్టీలో ఉంటాయని అభిప్రాయపడ్డారు నాగబాబు. మరి ఇది జోస్యం అనుకోవాలా? టీడీపీపై కోపంతో? అనుకోవాలా? అన్నది తర్వాత చూద్దాం.
టీడీపీ ముగిసిన అంకం..ఆపార్టీకి అంత సీన్ లేదని ఓ ఛానల్ లో చెప్పుకొచ్చారు. టీడీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకీ బీజేపీ-జనసేన కూటమి మధ్యనే పోటీ ఉంటుందని నాగబాబు అన్నారు. టీడీపీ విపరీతమైన అవినీతి చేయడం వలనే ప్రజలు గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్నారు. ఇక పార్టీ గాల్లో కలిసి పోయినట్లేనని రెండు చేతులు గాల్లోకి ఎత్తి చూపించారు. అలాగే తనదైన శైలిలో జనసేనపై ధీమా వ్యక్తం చేసారు. 2024లో జనసేన అధికారంలోకి వస్తుందని, పవన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తారు. జనసేనలో నాదెండ్ల మనోహర్ ప్రమేయం అంతగా లేదన్నారు.అవన్నీ పుకార్లు మాత్రమేనని, మనోహార్ ని నియమించిందే పవన్ అని, తన మద్దతు మనోహార్ కు ఎప్పుడూ ఉంటుందన్నారు. అలాగే చిరంజీవికి ఇక రాజకీయాలు ఆసక్తి లేదని..అందుకే సినిమాలు చేస్తున్నారన్నారు. ఒకవేళ చిరు ఆసక్తి చూపిస్తే గనుక జనసేనలోకే వస్తారు తప్ప మరో పార్టీ కండువా కప్పుకోరని కుండ బద్దలు కొట్టారు.