Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ వ్యవహారంపై స్పందిస్తూ అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే?: భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.జి. జయసూర్యపై గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సివిల్ సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారని, అక్రమ జూదం (పేకాట క్లబ్బులు) వంటి కార్యకలాపాలకు సహకరిస్తున్నారని బాధితులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన పవన్ కల్యాణ్, దీనిపై లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని, డీజీపీని గతంలోనే ఆదేశించారు.

విచారణలో ఆరోపణలు నిజమని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం జయసూర్యపై బదిలీ వేటు వేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ, ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించింది.
అంబటి రాంబాబు సెటైర్: ఈ బదిలీ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. “ఎట్టకేలకు డీఎస్పీ జయసూర్యను బదిలీ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు. ఒక సామాన్య పోలీసు అధికారి బదిలీని పవన్ కల్యాణ్ ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారనే అర్థం వచ్చేలా అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ నిర్ణయాలపై అంబటి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా డీఎస్పీ బదిలీని కూడా రాజకీయ విమర్శలకు వేదికగా మార్చుకోవడంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి పవన్ vs అంబటి వార్ ముదిరినట్లయింది.

