Bye Bye Ys Jagan : అప్పుడు బైబై బాబు.. ఇప్పుడు బైబై వైఎస్ జగన్.!

Bye Bye Ys Jagan : అదే స్లోగన్.. ఈసారి కాస్త కొత్తగా మారింది. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. అంతే తేడా.! వైఎస్ జగన్ తన మంత్రి వర్గంలోని మంత్రులతో రాజీనామా చేయించాక, అనూహ్యంగా సోషల్ మీడియాలో ‘బై బై వైఎస్ జగన్’ అనే హ్యాష్ ‌ట్యాగ్ ట్రెండింగ్ అవడం మొదలైంది.

దీన్ని ఎవరు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

సహజంగానే విపక్షాలు.. అందునా ప్రధాన ప్రతిపక్షం ఈ తరహా వ్యవహారాలు నడుపుతుంటుంది. గతంలో.. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, ఆయన్ని దించేందుకు వైసీపీ ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేసింది.

ఇప్పుడు అదే పని వైఎస్ జగన్ విషయంలో టీడీపీ చేస్తోందని అనుకోవచ్చు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ కట్స్ వ్యవహారం నేపథయంలో ‘బై బై వైఎస్ జగన్’ అంటూ నినదిస్తున్నారు నెటిజనం. అంతేనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళి, రాష్ట్రం అదనంగా అప్పు చేసుకునేందుకు వెసులుబాటు తీసుకొచ్చారన్న మంట కూడా నెటిజనంలో కనిపిస్తోంది.

ప్రత్యేక హోదానో, రైల్వే జోన్‌నో, అమరావతి కోసమో లేదంటే పోలవరం ప్రాజెక్టు కోసమో కేంద్ర నిధులు తీసుకురావాల్సింది పోయి, జగన్ ఢిల్లీ టూర్ అనంతరం.. ఢిల్లీ నుంచి ‘అదనంగా అప్పు చేసుకోవడానికి అవకాశం’ రావడమేంటి.? అన్న చర్చ జన బాహుళ్యంలో బాగా వినిపిస్తోంది.

అయితే, విపక్షాలు ఎంత హంగామా చేసినా, ప్రస్తుతానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టడం ఎవరికీ సాధ్యం కాదు రాజకీయంగా. అలాగని వైఎస్ జగన్ అతి విశ్వాసంతో వుంటే.. అదే రాజకీయంగా ఆయన కొంప ముంచేస్తుంది.