సముద్రంలోకి వృధాగా కృష్ణమ్మ: ఎవరికీ నోరు పెగలట్లేదెందుకు.?

T'gana Overaction, Krishna Watter is getting wasted

T'gana Overaction, Krishna Watter is getting wasted

ఇది నిజంగానే రాజకీయ వైపరీత్యం. జూరాల దాటుకుని, శ్రీశైలం మీదుగా, నాగార్జున సాగర్.. పులిచింతల కూడా దాటేసి.. ఆనక ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతోంది కృష్ణా నది నీరు. వరదలు పోటెత్తుతున్న పరిస్థితుల్లో అయితే, మంచి విషయమే ఇది. కానీ, ప్రాజెక్టులేవీ నిండలేదు.. పై నుంచి ఈ ఏడాది రావాల్సిన స్థాయిలో నీరు వస్తుందో లేదో తెలియదు.

కానీ, సముద్రంలోకి వృధాగా నీరు వెళ్ళిపోతోంది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం, అత్యంత వివాదాస్పద రీతిలో చేస్తున్న రాజకీయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నుంచి రాయలసీమ ఎత్తి పోతల పథకం ద్వారా నీటిని తరలించుకుపోతుందన్న ముందస్తు అనుమానంతో, అక్కసుతో తెలంగాణ ప్రభుత్వం పంతానికి పోయి.. కృష్ణా నది నుంచి నీటిని అడ్డగోలుగా కిందికి పంపించేస్తోంది ప్రధాన ప్రాజెక్టుల ద్వారా.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి.. నాగార్జున సాగర్ అలాగే పులిచింతల నుంచి కూడా విద్యుదత్పత్తి చేస్తూ నీటిని కిందికి వదిలేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆయా ప్రాజెక్టుల్లో తమ విద్యుత్ తయారీ వాటా మేరకు మాత్రమే.. అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. పైగా, ప్రాజెక్టుల వద్ద పెద్దయెత్తున భద్రత కోసం పోలీసుల్ని, ఇతర బలగాల్ని మోహరించింది.

దాంతో, ఏపీ ప్రభుత్వం అధికారుల్ని పంపింది తెలంగాణ ప్రభుత్వంతో చర్చల కోసం నీరు సముద్రంలోకి వృధాగా పోతోందనీ, ఆ నీటిని ప్రస్తుతం వ్యవసాయం లేదు గనుక వాడుకునే పరిస్థితి కనిపించడంలేదని అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలిపారు. ఇంత జరుగుతున్నా, ఏపీకి చెందిన విపక్షాలేవీ, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం సైతం చేయాల్సిన స్థాయిలో తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలేదన్న విమర్శలున్నాయి.