ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న రీతిలో మాత్రమే 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందనే చిన్న ఆశ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. నిజానికి, తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. కానీ, ఒకప్పటి పరిస్థితికీ, ఇప్పటి పరిస్థితులకీ చాలా తేడాలున్నాయ్. టీడీపీకి ఇప్పుడు నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. ఇద్దరూ పార్టీ కోసం కష్టపడిపోతున్నట్టు చెప్పుకుంటున్నా, పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేరు.. వున్నవారిలోనూ భజన పరులు, అవకాశవాదులే కనిపిస్తున్నారు. ఎలా.? 2024 ఎన్నికల్లో టీడీపీ నావ విజయ తీరాలకు చేరేదెలా.? ఈ ప్రశ్న సగటు టీడీపీ కార్యకర్తని అయోమయంలోకి నెట్టేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, జూమ్ మీటింగుల్లో ‘మనమే అధికారంలోకి రాబోతున్నాం..’ అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. అధికారులకు వార్నింగులు ఇచ్చేస్తున్నారు, తాము అధికారంలోకి వచ్చాక.. తప్పు చేసినవారందరిపైనా చర్యలు తీసుకుంటామంటూ. అంతేనా, అధికార వైసీపీ మీద కూడా ‘స్థాయిని మరిచి’ విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ ‘స్థాయి’ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలూ పడాల్సి వస్తోంది. పార్టీ ఫిరాయింపుల్ని గట్టిగా ప్రోత్సహించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటే, జస్ట్.. కొన్ని రోజుల్లోనే టీడీపీ ఖాళీ అయిపోతుంది.
23 మంది ఎమ్మెల్యేలలో ప్రస్తుతం టీడీపీకి ఎంతమంది మిగిలారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఇదిలా వుంటే, లోకేష్ దూకుడుతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని కొందరు భజన పరులు నినదిస్తోంటే, చంద్రబాబు అవి విని పండగ చేసుకుంటున్నారు. ఇలా పండగ చేసుకుంటున్న టీడీపీ, 2024 టార్గెట్.. అంటోంటే జనానికి నవ్వు రాకుండా వుంటుందా.?