చరిత్రలోనే ఇదే తొలిసారి. ఎప్పుడూ కూడా ఎంత పెద్ద విపత్తు వచ్చినా.. 6 నెలల పాటు విద్యాసంస్థలను మూసి ఉంచలేదు. మొదటిసారి 6 నెలల పాటు కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇప్పటికే.. విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటికీ.. స్కూళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 లో భాగంగా విద్యాసంస్థలను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
2019-20 విద్యాసంవత్సరం కూడా పూర్తి కాకముందే ముగిసిపోయింది. అలాగే 2020-21 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమయి సగం కావస్తున్నా విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసి విద్యాసంస్థలను తెరుచుకునేందుకు అనుమతిచ్చింది.
దీంతో ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అయితే.. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవు. ఆ జోన్ లో ఉన్న విద్యార్థులు కూడా స్కూళ్లకు వెళ్లడానికి వీలులేదు.
కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా… వాటిని ఓపెన్ చేయడంపై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు అసోం, హర్యానా, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
న్యూఢిల్లీ, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడే విద్యాసంస్థలను తెరవడానికి సంసిద్ధంగా లేమని ప్రకటించాయి.
సాధారణంగా కరోనా నియంత్రణ కోసం ఎటువంటి నిబంధనలను ప్రజలు పాటిస్తున్నారో… విద్యాసంస్థల్లోనూ ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిందే. విద్యాసంస్థల్లో ఉన్న స్టాఫ్ట్, విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. గేట్ ముందే శానిటైజర్ తో విద్యార్థులు తరగతి గదిలోకి ఎంట్రీ అవడానికి ముందే చేతులు శుభ్రం చేసుకోవాలి. తరగతి గదులన్నింటినీ.. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. విద్యార్థులు కూర్చునే కుర్చీల మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండాలి. ఎవరి వస్తువులు వాళ్లే వాడుకోవాలి.. ఇలాంటి నిబంధనలను పాటిస్తూ విద్యాసంస్థలను నడుపుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇక.. ఏపీలో 9 నుంచి 12 తరగతుల వాళ్లు మాత్రమే బడికి వెళ్లేందుకు అనుమతి ఉంది. చిన్న తరగతులకు ఆన్ లైన్ లోనే క్లాసులు బోధిస్తారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల్లోనూ ఎవరికైనా పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఇంట్లో నుంచే ఆన్ లైన్ క్లాసులు వినొచ్చు.