బీజేపీని విమర్శించాలా.? కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాలా.? మరో రాజకీయ పార్టీపై మండిపడాలా.? పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్ సభ, రాజ్యసభల్లో చోటు చేసుకున్న రగడకు ఎవరు బాధ్యత వహించాలి.? ఏ ఒక్క పార్టీనో ఇక్కడ విమర్శిస్తే అది సబబు కాదు. ఏ ఒక్కర్నీ తప్పు పట్టడానికి లేదు. అందరూ, అన్ని రాజకీయ పార్టీలూ ఈ పరిస్థితులకు బాధ్యత వహించాలి. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టడం సంగతి పక్కన పెడితే, మొత్తంగా పార్లమెంటు పరువు పోతోందన్నది నిర్వివాదాంశం. ఇంకా ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం పరువు పోయేలా చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.
చట్ట సభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలకు సంబంధించి అధికారిక వీడియోలు, అనధికారిక వీడియోలు.. భారతదేశం పరువునే తీసేస్తున్నాయన్న ఆవేదన దేశ ప్రజానీకంలో కనిపిస్తోంది. ‘ఇలాంటి దుందుడుకు చర్యలు ముందు ముందు కూడా కొనసాగేలా వుంటే, అసలు చట్ట సభల కార్యకలాపాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయకుండా వుంటేనే మంచిది..’ అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పార్టీలుగానీ, రాజకీయ నాయకులుగానీ.. తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడమనేది ఇప్పుడున్న రాజకీయాల్లో సాధ్యం కాదు. చట్ట సభలంటే, ప్రజల కోసం చర్చ జరగాల్సిన పవిత్రమైన వేదికలు. కానీ, ఆ చట్ట సభల్లో వ్యక్తిగత దూషణలకే ఎక్కువ సమయం వినియోగించబడుతోంది. పార్టీలకతీతంగా అందరూ కలిసి నానా రకాల విమర్శలూ చేసుకోవడం ఓ యెత్తు.. చివరికి తమక్కావాల్సిన బిల్లుల్ని అధికార పార్టీలు ఆమోదింపజేసుకోవడం ఇంకో యెత్తు. దీన్నసలు ప్రజాస్వామ్యం అనగలమా.? అన్న ఆవేదన దేశ ప్రజల్లో వ్యక్తమవుతోంది.