Political Colors : జగన్ సర్కారు రంగుల్ని చంద్రబాబు సర్కార్ మార్చేస్తుందా.?

Political Colors : గతంలో టీడీపీ హయాంలో పలు ప్రభుత్వ కార్యాయాలకు పసుపు రంగు పులిమిన వైనం అందరికీ గుర్తుండే వుంటుంది. అదే టీడీపీ, వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల్ని పులమడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం చూస్తేనే వున్నాం. న్యాయస్థానాలు జగన్ సర్కారుకి ఈ రంగుల పైత్యంపై ఝలక్ ఇవ్వడం తెలిసిన విషయమే.

కాగా, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వీలైనంత ఎక్కువగా వైసీపీ రంగుల్ని వాడేస్తోంది వైఎస్ జగన్ సర్కార్. తాజాగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం విషయంలోనూ అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు వైసీపీ రంగులు పులిమేయడంతోపాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోని కూడా వుంచుతున్నారు.

ఇప్పుడీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గనుక గెలిస్తే, ఇప్పుడున్న వాటి రంగులన్నీ మారిపోతాయనీ, కొత్త ధృవపత్రాలు, కొత్త రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వ్యవహారం పసుపు రంగుతో నిండిపోవడం ఖాయమనీ చర్చించుకుంటున్నారు జనం.

సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు, తిరిగి ప్రజల నుంచే వసూలు చేయబడుతుంది పన్నుల రూపంలో. మరి, అలాంటప్పుడు ఎవరు అధికారంలో వున్నా తమకు నచ్చిన రంగులు, తమ ఫొటోల్ని ఎందుకు వాటికి అతికిస్తారన్నదే అసలు చర్చ. ఇలా అంటించడం ద్వారా, రంగులు పులమడం ద్వారా.. సభ్య సమాజానికి వీళ్ళిచ్చే సందేశం ఏంటి.?

వైసీపీ రంగులేయడానికి పెద్దయెత్తున ఖర్చయింది.. కోర్టు మొట్టికాయలతో ఆ రంగుల తొలగించడానికి మళ్ళీ ఖర్చవడం మామూలే. అంటే, ప్రభుత్వ పెద్దల పైత్యానికి ప్రజా ధనం వృధా అవుతోందన్నమాట. ఎన్టీయార్ హయాంలో, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరుల హయాంలో ఆయా పథకాల కింద లబ్దిదారులై, ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్ళు పొందినవారు, ఇప్పుడు వైఎస్ జగన్ ఫొటోలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పొందుతున్నారంటే.. ముందు ముందు వాటి రంగులూ ఖచ్చితంగా మారతాయ్.. వాటి కోసం మళ్ళీ అదనపు ఖర్చు.

పాలన అంటే, రంగులు మార్చడమే అన్న స్థాయికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం దిగజారిపోయిందన్నమాట.