జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, తమ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాలంటే 1100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ, ఏడాదిన్నరగా కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక సమస్యల కారణంగా, ఆ వ్యయాన్ని రాష్ట్రం భరించలేదని పేర్కొంటూ, కేంద్రమే వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని లేఖాస్త్రం సంధించారు. మరోపక్క, కేరళ ముఖ్యమంత్రి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాక్సినేషన్ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇప్పటికే 11 రాష్ట్రాలు ఈ తరహా ఆందోళనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. నిజానికి, వ్యాక్సినేషన్ అనేది కేంద్రం బాధ్యత. ఎందుకంటే, కరోనా మహమ్మారిని ‘పాండమిక్’ అని ఎప్పుడో ప్రకటించేసుకున్నాం గనుక. అయితే, కేంద్రం ఇప్పటికే వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు అందిస్తోంది. అదీ, 45 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే. 18 నుంచి 45 ఏళ్ళ వయసువారికి మాత్రం వ్యాక్సిన్లు సరిగ్గా అందడంలేదు. అవి రాష్ట్రాలు తమ సొంత ఖర్చులతో కొనుక్కోవాలి. లేదంటే, ఆయా వ్యక్తులు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనుక్కోవాలి.
రాష్ట్రాలు కొనుక్కున్నా, వ్యక్తులు కొనుక్కున్నా.. అదనపు ధర తప్పదు. ఇదెక్కడి వింత.? అని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మొట్టికాయలేసినా కేంద్రం వైఖరి మారడంలేదు. కేంద్రానికి ఏ ధరకు వ్యాక్సిన్ అందుతోందో, అదే ధరకి వ్యాక్సిన్.. సామాన్యులకు అందుబాటులోకి వచ్చినా అది పెద్ద ఊరట అనే భావించాలి ప్రస్తుత పరిస్థితుల్లో. మరోపక్క, రాష్ట్రాలకే కాదు.. కేంద్రానికి కూడా ఆర్థిక ఇబ్బందులున్నాయన్నది బీజేపీ వాదన. పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నారు.. పన్నుల మోత మోగిస్తున్నారు.. రాష్ట్రాల హక్కుల్ని లాగేసుకుంటున్నారు.. కేంద్రానికి వచ్చిన నష్టమేంటి.? అన్నది ఆర్థిక నిపుణుల వాదన. అయినా, టీకా ధర అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలెందుకు ఉలిక్కిపడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు.