ఇసుక ప్రకటనతో వైఎస్ జగన్ సర్కార్ కంట్లో నలక.!

ఓ పక్క రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయ్. ఇంకోపక్క వైఎస్ జగన్ సర్కార్, పత్రికల్లో ఇసుక విషయమై ప్రకటనలిచ్చింది. ఇప్పుడీ వ్యవహారంపై బోల్డంత రాజకీయ రచ్చ జరుగుతోంది. గడచిన రెండున్నరేళ్ళుగా వైఎస్ జగన్ సర్కార్, ఇసుక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న విషయం విదితమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యమైన ఇసుక బ్లాక్ మార్కెట్‌లో మాత్రమే దొరుకుతోందన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయమై కొందరు అధికార పార్టీ నేతలు కూడా బాధితులే. కొత్త ఇసుక ఫార్ములా కాస్త, రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందన్న విమర్శలున్నాయి.

అయితే, ఇసుక విధానంలో లోపాల్ని సవరించుకుంటూ.. రకరకాల ప్రయత్నాలు చేస్తోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజా ప్రకటనలు కూడా పత్రికల్లో ప్రభుత్వం తరఫున ఇసుక విషయమై వచ్చాయని అనుకోవాలి. అయితే, వరదల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దరిమిలా, ఈ సమయంలో ప్రకటనలేంటన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తోంది.

ప్రకటనల కోసం వెచ్చించే మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించినా ఎంతో కొంత ఊరట.. అన్న అభిప్రాయమైతే బాధితుల్లో వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద బాధితులకు అండగా వుండాలంటూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినా.. అదీ ఆలస్యంగా జరిగిందన్న విమర్శలున్నాయి.

విపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేస్తాయన్నదాంట్లో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘సలహాదారులు’ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయాలూ లేకపోలేదు. ఇసుక విషయమై పత్రికా ప్రకటనల విషయంలో ఒకటికి పదిసార్లు ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకుని వుండాల్సిందే.