Kodali Nani : అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద పేరు సంపాదించుకోవడం కోసం తన స్థాయిని రోజు రోజుకీ అత్యంత అధ్వాన్నంగా దిగజార్చేసుకుంటున్నారు మంత్రి కొడాలి నాని. వైసీపీలో చాలా మంది నాయకులున్నారు. ఎవరూ చంద్రబాబుని ఇంతలా ధూషించడం లేదు.
రాజకీయాల్లో ‘ధూషణ’ అంటే తమ స్థాయిని దిగజార్చుకోవడమే. అయితే, కొడాలి నానికి మాత్రం అవేమీ పట్టవు. రాజకీయాల్లో బూతులు అందరికీ వచ్చు. సంస్కారమే అడ్డొస్తుంది ఎవరైనా. ఉచ్ఛనీచాలు కోల్పోవడం చాలా తేలిక. వాటిని అదుపులో వుంచుకోవడమే చాలా కష్టం. ఇక్కడ కొడాలి బూతుల కారణంగా వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతోంది.
అన్నింటికీ మించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాయి తగ్గించబడుతోంది కొడాలి నాని బూతుల కారణంగా. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేనో, కింది స్థాయి నాయకుడో బూతులు తిడితే అదో లెక్క. కానీ, ఓ మంత్రి పని గట్టుకుని అనునిత్యం బూతులు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటే, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుతుంది.
కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతుంటే, వాటిని వైసీపీ మహిళా నేతలే చూడలేకపోతున్నారు. విని, చూసి తట్టుకోలేకపోతున్నారు. పార్టీ ప్రతిష్ఠని పెంచాల్సిన మంత్రి, అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీకీ చెడ్డ పేరు తెస్తున్నారని వాపోతున్నారు. కానీ, కొడాలి మాత్రం తాను అందరూ మాట్లాడుకునే మాటలే మాట్లాడుతున్నానంటున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కొడాలి నాని నోటిని అదుపు చేయకపోతే, పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుంది. మహిళా లోకం వైసీపీకి ఎదురు తిరిగే పరిస్థితి రావొచ్చు.