Janasena : ఓసారి దెబ్బ తిన్నారు.. మళ్ళీ మరోసారి కూడా దెబ్బతిన్నారు. మళ్ళీ మళ్ళీ దెబ్బ తినడానికి సిద్ధంగా వున్నారా.? జనసేన విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోబోతోందట. కాదు కాదు, జనసేనతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతోందన్నది వాస్తవం.
నిజమే, తెలుగుదేశం పార్టీకి అధికారం అత్యవసరం. ఏ రాజకీయ పార్టీకైనా అంతే అయినా, టీడీపీది ‘చారిత్రక అవసరం’గా మారిపోయిందిప్పుడు. ఈసారి అధికారంలోకి రాకపోతే, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తేయాల్సిందే. అందుకే, ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాల్నీ పరిశీలిస్తోంది టీడీపీ అధినాయకత్వం. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు కోసం అర్రులు చాస్తోంది పసుపుదళం.
మరి, జనసేన సంగతేంటి.? జనసేన నేతలైతే, టీడీపీతో పొత్తు అనేది జరిగే ప్రసక్తే కాదంటున్నారు. మరి, మొన్నీమధ్యన అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభలో టీడీపీ – జనసేన ఎందుకు కలిసి పాల్గొన్నట్టు.? అంటే, ఆ సభలో మిత్రపక్షం బీజేపీ కూడా వుందన్నది జనసేన నేతల వాదన.
జనసేన పార్టీకి ఇవ్వబోయే సీట్ల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసేశారట. పైగా, టెంప్టింగ్ ఆఫర్ కూడా జనసేన ముందు చంద్రబాబు వుంచుతున్నారట.. ఇది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్నతాజా ఖబర్. అయితే, జనసేన మాత్రం.. ససేమిరా అనేసిందన్నది ఇంకో వాదన.
కాగా, టీడీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదనీ, అసలు టీడీపీ గురించి తాము ఆలోచించడంలేదనీ జనసేన నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, బీజేపీతో కలిసి అధికార పీఠమెక్కుతామని జనసేన గట్టిగా నమ్ముతోంది.