TDP : ప్రత్యేక హోదాపై వైసీపీ అప్పుడెందుకు టీడీపీని ప్రశ్నించింది.?

TDP : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కేంద్రం పరిధిలోనిది.. రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత నిందించడమేంటి.? అంటూ వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ వాదనే నిజమనుకుందాం.. మరి, ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ గతంలో ఎందుకు టీడీపీని నిలదీసింది.? టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది.?

ఇక్కడ వైసీపీ లాజిక్ స్పష్టంగానే వుంది. అదేంటంటే, అప్పట్లో టీడీపీ, బీజేపీ కలిసి నడిచాయి. కేంద్రంలో టీడీపీ అధికారం పంచుకుంటే, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని పంచుకుంది. సో, రాష్ట్రంలో అధికారంలో వున్న టీడీపీని ప్రతిపక్ష నేత హోదాలో అప్పట్లో వైఎస్ జగన్ ప్రశ్నించడంలో తప్పు లేదు.

అయితే, ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. అదేంటంటే, ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో ప్రత్యేక హోదా విషయమై ఏనాడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక్క మాట కూడా అనలేదు.

ఎలా చూసినా, వైసీపీ నేతలు తాము లాజికల్‌గా మాట్లాడుతున్నామని చెప్పడంలో అర్థమే లేదు. ప్రత్యేక హోదా విషయంలో అప్పట్లో టీడీపీ ఏం చేసిందో, దానికి భిన్నంగా అయితే వైసీపీ ఏమీ చేయలేకపోతోంది. అప్పట్లో అధికారంలో వున్న వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసింది లేదు. రాజీనామా దండగని అన్నారు కూడా. ఇప్పుడు అదే మాట వైసీపీ ఎంపీల నుంచి వినిపిస్తోంది.

ఇక, రైల్వే జోన్ విషయమంటారా.? పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నిటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, కేంద్రంతో పోరాడాల్సిన బాధ్యత వైసీపీదే. అదే సమయంలో విపక్షాలేవీ, రైల్వే జోన్ విషయంలో కావొచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు.. రాష్ట్రంలోని ఇతర పార్టీలపై విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు.