NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, టీడీపీ అనుకూల మీడియా దెబ్బకి ‘కార్నర్’ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రమే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇది అతి పెద్ద మల్టీ స్టారర్.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా, టీడీపీ అనుకూల మీడియా, యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ఇరకాటంలో పడేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల విషయమై.
‘మీ సన్నిహితులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నారు కదా.. టిక్కెట్ ధరలు తగ్గించమని అడుగుతారా.?’ అన్న ప్రశ్న ఎన్టీయార్ ముందుకొచ్చింది టీడీపీ అనుకూల మీడియా ద్వారా. ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీయార్ ఎలా స్పందించాలో తెలియక కంగారు పడ్డాడు.
నిర్మాత దానయ్య మైక్ అందుకుని, ప్రభుత్వంతో పరిశ్రమ తరఫున చర్చలు జరుగుతున్నాయనీ, పెద్ద సినిమాలకు తగ్గించిన టిక్కెట్ ధరలు ఏమాత్రం మేలు చేయవని అన్నారు. దానయ్య కవర్ చేయడంతో, జూనియర్ ఎన్టీయార్ అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు.
ఇంతకీ, ఆ సన్నిహితులెవరు.? ఇంకెవరు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ. అయితే, ఎన్టీయార్‌తో తమ స్నేహం ఒకప్పుడు వుండేదనీ, ఇప్పుడు లేదని నాని, వంశీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై ఎన్టీయార్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అనుకూల మీడియా మీద.
ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీపై మండిపడుతున్నారు అతని అభిమానులు. చిరంజీవి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడే కదా.. రామ్ చరణ్‌కి ఈ ప్రశ్న ఎందుకు వెయ్యరంటూ ఎన్టీయార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కొత్త చిచ్చు పెట్టినట్లయ్యింది.