అమెరికా-పాకిస్తాన్ మిలిటరీ డీల్: AIM-120 AMRAAM క్షిపణులు.. భారత్‌కి సవాల్..!

అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. ఇటీవల వైట్ హౌస్‌లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాతే అమెరికా పాకిస్తాన్‌కు అత్యాధునిక ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AIM-120 AMRAAM) అందించేందుకు 2.5 బిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ డీల్ ఖరారు చేసిందని వార్తలు వెలువడ్డాయి.

AMRAAM క్షిపణులు “ఫైర్ అండ్ ఫర్గాట్” సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఒకసారి ఫైటర్ జెట్‌లో నుండి ప్రయోగించిన తరువాత స్వయంచాలకంగా లక్ష్యాన్ని ట్రాక్ చేసి ధ్వంసం చేస్తాయి. ఈ క్షిపణులు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లకు అనుకూలంగా ఉండటం, పాకిస్తాన్‌లోని ఎఫ్-16 ఫ్లీట్‌లను నవీకరించడానికి అవకాశాన్ని ఇవ్వడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

అమెరికా ఈ ఒప్పందంతో పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌లకు కూడా అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఈ మిలిటరీ డీల్ క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి వ్యాపార ప్రాధాన్యాల కోసం కూడా అమలు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ కు ఈ ఒప్పందం సవాలు సృష్టిస్తోంది. 2019లో భారతీయ MiG-21 ఫైటర్‌ను పాకిస్తాన్ AMRAAM క్షిపణి ఉపయోగించి కూల్చిన సంఘటన గమనిస్తే, భవిష్యత్తులో భారత్ పై వృద్ధి చెందే మిలిటరీ ప్రెజర్ స్పష్టమవుతుంది. విశ్లేషకులు, అమెరికా సొంత ప్రయోజనాల కోసం ఈ మిలిటరీ సహకారాన్ని పాకిస్తాన్‌కు ఇస్తోందని, దీని వల్ల దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు ఇంకా సంక్లిష్టమవుతాయని పేర్కొంటున్నారు.

అంతేకాదు పాకిస్తాన్ AMRAAM క్షిపణులను ఉపయోగించి తమ ఎఫ్-16 ఫైటర్ ఫ్లీట్‌ను అప్గ్రేడ్ చేస్తే, భవిష్యత్తులో భారత వాయు సేనకు ఎదుర్కోవాల్సిన సవాళ్లు మరింత పెరుగుతాయి. సైనిక నిపుణులు, ఈ ఒప్పందం క్రమంలో పాకిస్తాన్-అమెరికా సంబంధాలు మరింత దృఢమవుతాయని, భూభౌగోళిక పరిస్థితులు, రణనీతులు దశలవారీగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు.