ఆపరేషన్ సింధూర్ 2.0 లోడెడ్.. ఎక్కువ చేస్తే పాకిస్తాన్ మ్యాప్ లో ఉండదు.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్..!

దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని మరోసారి ఋజువు చేస్తూ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ సరిహద్దు చెక్‌పోస్ట్‌ను శుక్రవారం సందర్శించిన ఆయన, సైనికులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ ప్రజలకు భరోసా కలిగించేలా, శత్రు దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

‘త్వరలోనే ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలవుతుందని తెలిపారు. ఈసారి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా చెరిపేస్తామని తెలిపారు. అప్పటికీ పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోకపోతే ఇక పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ పటంలోనే ఉండదని పేర్కొన్నారు. తాము ప్రతీ పరిస్థితికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి తావు లేకుండా చేయడమే తాము అనుసరిస్తున్న వ్యూహమని ఆయన తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ ప్రస్తావిస్తూ ద్వివేది, ఆ సమయంలో సైన్యం దాయాది దేశంతో చెస్ ఆట ఆడినట్టే. శత్రువు తదుపరి కదలికలు తెలియకపోయినా, సమయానికి ప్రతిస్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో త్రివిధ దళాలు కలసి, శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయి అని వివరించారు.

ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రవాదులను భరించబోమని ద్వివేది మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ పటంలో కొనసాగాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి. లేదంటే చరిత్రలోంచే మాయం అవ్వాల్సి వస్తుంది.. ఇది హెచ్చరిక కాదు.. చివరి చాన్స్ అని ఆయన అన్నారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలు పెంపు, ఆధునిక ఆయుధాల వినియోగం, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన వెల్లడించారు. కొత్త సాంకేతికతతో ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ రెడీగా ఉందని చెప్పారు.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలకు ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద తరచూ ఉగ్రవాదుల చొరబాట్ల ప్రయత్నాలు జరుగుతుండగా, వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.