అయోధ్యలో నిర్మితమైన రామ మందిరంపై మరోసారి అంతర్జాతీయ రాజకీయ వేడి రాజుకుంది. రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన భారత్, పాకిస్తాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
రామ మందిరంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ గమనించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మతతత్వం, మైనారిటీ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు ఉన్న దేశం ఇతరులకు నీతులు చెప్పే నైతిక హక్కు లేకుండా పోయిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉపన్యాసాలు ఇవ్వడం కంటే ముందు పాకిస్తాన్ తన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
అయోధ్యలో మోడీ కాషాయ జెండా ఎగరేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శిస్తూ, ఇది భారత్‌లో మైనారిటీలపై ఒత్తిడి పెంచే చర్యగా పేర్కొంది. అంతేకాదు, 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీద్ స్థలంలో రామ ఆలయం నిర్మించడాన్ని ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణిస్తూ పాక్ తన స్థాయి దాటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదానికి సంబంధించిన చారిత్రక పరిణామాలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అనంతరం దశాబ్దాలుగా కోర్టుల్లో సాగిన విచారణను 2019లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో ముగించింది. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ వివాదానికి న్యాయపరమైన ముగింపు పలికింది.
2020లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేయగా, 2024లో భవ్యమైన రామ మందిరం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి అయోధ్య దేశానికి ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యంగా అభివర్ణిస్తోంది.
పాకిస్తాన్ తరచూ భారత్‌పై విమర్శలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై రాజకీయ లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రపంచ సమాజం మాత్రం పాక్ ఉద్దేశాలను గమనిస్తోందని భారత విశ్లేషకులు చెబుతున్నారు. మైనారిటీల భద్రత, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో పాకిస్తాన్ తన స్వంత రికార్డుపై ముందుగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని భారత్ ఘాటుగా స్పష్టం చేసింది. ఈ వ్యవహారం భారత్–పాక్ మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీయనుందనే చర్చ మొదలైంది.
