Before Sleep: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. అదృష్టం తలుపు తడుతుంది..!

రోజంతా అలసట, టెన్షన్, పరుగుల జీవితం.. చివరికి మంచంపై పడుకున్నాక కూడా మనసు ప్రశాంతంగా ఉండడం చాలా మందికి కష్టంగానే మారింది. అయితే మన పూర్వీకులు చెప్పిన ఒక చిన్న అలవాటు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించగలదంటున్నారు వాస్తు, జ్యోతిష్య నిపుణులు. అదే.. నిద్రపోయే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవడం. ఇది కేవలం శుభ్రత కోసమే కాదు, మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుందనే నమ్మకం కూడా ఉంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పడుకునే ముందు కాళ్లు కడుక్కోవడం వల్ల జాతకంలో శని ప్రభావం బలపడుతుందని విశ్వసిస్తారు. శని అనుకూలంగా మారినప్పుడు ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం వంటి అంశాల్లో ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుందనే నమ్మకం ఉంది.

మరోవైపు వాస్తు శాస్త్రం పాదాలను మన శరీరంలో అత్యంత శక్తివంతమైన భాగంగా భావిస్తుంది. రోజంతా నేలపై నడిచే కాళ్లకు ప్రతికూల శక్తి ఎక్కువగా చేరుతుందని, వాటిని నిద్రకు ముందు శుభ్రం చేయడం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కుటుంబ వాతావరణంలో ప్రశాంతత పెరుగుతుందని, గొడవలు తగ్గుతాయని, మనసు హాయిగా మారుతుందని అంటున్నారు.

పురాతన గ్రంథాలైన గరుడ పురాణం, మనుస్మృతిలో కూడా ఈ ఆచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పండితులు వివరిస్తున్నారు. పాదాలను కడుక్కోవడం వల్ల మనస్సు శుద్ధి అవుతుందని, అంతర్గత అశాంతి తగ్గుతుందని ఈ గ్రంథాలు సూచించాయి. ముఖ్యంగా తరచూ భయంకరమైన కలలు, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందనే నమ్మకం ఉంది.

శాస్త్రీయంగా చూసినా, గోరువెచ్చని నీటితో కాళ్లు కడుక్కోవడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. రోజంతా పేరుకుపోయిన మానసిక భారాన్ని కూడా ఇది కొంతవరకు తగ్గించగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చిన్న అలవాటుగా అనిపించిన ఈ పద్ధతి.. మన ప్రశాంత నిద్రకు, మానసిక సమతుల్యతకు, అదృష్టానికి దారి చూపుతుందనే నమ్మకాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ సంప్రదాయ నమ్మకాలు, వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా ఉన్నవి మాత్రమేనని, ఎవరు అయినా ఇవి పాటించేముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.