మార్కెట్ ధర 2 వేలు, బ్లాక్ మార్కెట్ ధర 60 వేలు. రెమిడిసివిర్ ఔషధానికి సంబంధించి మీడియాలో వినిపిస్తున్న కథనాల సారాంశమిది. అసలు రెమిడిసివిర్, కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు ఎంతవరకు ఉపయోగకరం.? మరణాల రేటుని తగ్గించే శక్తి ఈ ఔషధానికి వుందా.? అన్నదానిపై క్లారిటీ లేదు. అయినాగానీ, రెమిడిసివిర్ ఔషధానికి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే బ్లాక్ మార్కెట్ రేటు అలా పెరిగిపోయింది. ఔషధానికే పరిస్థితి ఇలా వుంటే, వ్యాక్సిన్ సంగతేంటి.? 50 శాతం వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందరికీ వ్యాక్సిన్ అందించే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా.? లేదంటే, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఆదాయం సమకూర్చేలా ఈ నిర్ణయం జరిగిందా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాక్సిన్, బహిరంగ మార్కెట్ విషయానికొస్తే.. ధర వెయ్యి రూపాయల వరకు వుండొచ్చని గతంలో అంచనా వేశారు. అప్పట్లో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. వ్యాక్సిన్ కోసం జనం ఎగబడుతున్నారు. దాంతో, వ్యాక్సిన్ ధర పది రెట్లు పెరుగుతుందో, వంద రెట్లు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక, వ్యాక్సిన్ ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చా.? అంటే, అదేమీ లేదన్నది నిపుణుల వాదన. వ్యాక్సిన్ అనేది వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది తప్ప, పూర్తిగా వ్యాధిని నిరోధించలేదన్నది వైద్య నిపుణులు చెబుతున్నమాట. నిజానికి, ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్లను ‘అత్యవసర వినియోగం’ కింద మాత్రమే తీసుకొచ్చారు. మరి, ఇలాంటి వ్యాక్సిన్ విషయంలో బహిరంగ మార్కెట్.. అనే ప్రస్తావన ఎంతవరకు సమంజపం.? ఏమో, పాలకులకే తెలియాలి.