Covid-19: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో తాజా కేసులు వెలుగుచూడటంతో కరోనా మళ్లీ తన స్థాయిని పెంచుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. హొస్కోటే ప్రాంతానికి చెందిన ఆ పసికందు శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్‌లో చేరగా, కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం మే 22న కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. పిల్లలకే కరోనా సోకుతోందన్న విషయం, ఇప్పటికే తల్లిదండ్రుల్లో భయం నెలకొనిపోవడానికి కారణమవుతోంది. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
కేరళలోనూ పరిస్థితి గమనించదగిన స్థాయిలో మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో ఇప్పటివరకు 182 కొత్త కేసులు నమోదు కాగా, కొట్టాయం జిల్లాలో అత్యధికంగా 57 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం జిల్లాలో 34, తిరువనంతపురం జిల్లాలో 30 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అప్రమత్తం అయ్యారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, అవసరమైతే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల ప్రభావం ఏపీలోనూ కనిపించే అవకాశముండటంతో, సరిహద్దు ప్రాంతాల్లో వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక ప్రజలు కూడా మరోసారి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం నెలకొంది.