కొన్నాళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్. ఆ ఎన్నికల్లో తృనమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. కానీ, ఆమె తన పార్టీని గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవకున్నా అసెంబ్లీకి వెళ్లారు ముఖ్యమంత్రి హోదాలో.
శాసన మండలి లేకపోవడంతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 6 నెలల లోపే, ఎమ్మెల్యే అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికకు తెర లేపారు. భవానీ పూర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మొదటి దపా ఓడి, గెలిచారు మమతా బెనర్జీ. బీజేపీ గెలిచి, ఓడింది.
రెండోసారి మమత గెలిచారు. బీజేపీ ఓడింది. ఇదో చిత్రమైన రాజకీయ సందర్భం. మమతా బెనర్జీని రాజకీయంగా తొక్కేయాలని బీజేపీ చాలా వ్యూహాలు రచించింది. మొదటి సారి అంటే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాక్షిక విజయం సాధించింది బీజేపీ. రెండోసారి దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకున్నట్లయ్యింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి దూకేశారు. అలా దూకేసిన వాళ్లలో దాదాపు అందరూ తిరిగొచ్చేశారు. వాళ్ల కోసం వందల కోట్లు ఖర్చు చేసిన బీజేపీకి చివరికి గుండు సున్నా మిగిలింది.
పశ్చిమ బెంగాల్‌లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. బీజేపీ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో గెలిచిన ఎమ్మెల్యేలతో దాదాపు సగం మంది తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. అదే జరిగితే, బెంగాల్ నుంచి బీజేపీ పూర్తిగా కనుమరుగైపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.
రివేంజ్ పాలిటిక్స్ నడపడంలో మమతా బెనర్జీ ధిట్ట అనే పేరుంది. ఆమెను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ చాలా చాలా ప్రయత్నాలు చేసింది. సో టిట్ ఫర్ టాట్ తప్పదంతే.