దేశ రాజకీయాల్లో ఆమె ఫైర్‌బ్రాండ్. చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపిస్తారు. ఆకుపచ్చ అంచు గల తెల్లచీర ధరిస్తారు. కాళ్లకు హవాయి చెప్పులు వేసుకుంటారు. వేళ్లూనుకుపోయిన కమ్యూనిస్టులను ఖంగు తినిపించారు. వారికి నిలువనీడ లేకుండా చేశారు. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్నారు. ఆమే మమతా బెనర్జీ. అభిమానులు ఆమెను దీదీ అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. అదే కాంగ్రెస్ పార్టీని గడ్డిపోచగా తీసి పడేశారు. పార్టీని తృణప్రాయంగా భావించారు. బయటికి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1998లో ఆవర్భవించిన తృణమూల్ కాంగ్రెస్.. దేశ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొంటోంది.
ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతారు. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మమత దీదీ ఆజ్ఞ లేనిదే ఏ పార్టీ కాలు పెట్టలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ విషయం రుజువైంది. నరేంద్ర మోడీ ప్రభంజనంలోనూ బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో చావుదెబ్బ తిన్నది. రెండంటే రెండు సీట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది. అలాంటి మమతా బెనర్జీని మరోసారి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. మమత బెనర్జీని కలుపుకొంటే తిరుగుండదని కాంగ్రెస్‌కూ తెలుసు.
మమతా బెనర్జీ తానే చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల మహా ర్యాలీకి రాదనుకున్న కాంగ్రెస్ కూడా హాజరైంది. కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింఘ్వీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వీలైనంత మేర మమతను ఆకాశానికెత్తేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఒక్కటే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దాదాపు అన్ని పార్టీల నాయకులు కూడా మమత తీసుకున్న చొరవను అభినందించారు. డైనమిక్ లీడర్ అని ప్రశంసించారు.
సరే! ర్యాలీ ముగిసింది. ఎవరి విమానాలు వాళ్లు ఎక్కేశారు. వాట్ నెక్స్ట్? ప్రతిపక్షాలు ర్యాలీలో చూపిన ఐక్యత కొనసాగుతుందా? విభిన్నరాజకీయ నేపథ్యాలు, అంతకంటే భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ ఒకే గూటికి చేరుకుంటారా? చేరుకుంటే.. వారికి ఎవరు దిశానిర్దేశం చేస్తారు? కాంగ్రెస్ మార్గదర్శనానికి మమత అంగీకరిస్తారా? శరద్ యాదవ్ చూస్తూ ఊరుకుంటారా? దేవేగౌడ సై అంటారా? కాంగ్రెస్‌ను వేలి వేసిన అఖిలేష్ యాదవ్ గానీ, ప్రధాని పదవిపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్న మాయావతి గానీ అడ్డు పడకుండా ఉంటారా?, స్టాలిన్ ఒప్పుకొంటారా? రాహుల్ గాంధీని కాదని సీనియర్లలో ఏ ఒక్కరి పేరునైనా ప్రధానిగా ప్రకటించగలరా? దీన్ని ఊహించలేం.
వాటన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పెత్తనాన్ని అంగీకరించలేరు. ఇక్కడ చంద్రబాబు పరిస్థితి వేరు. ఎందుకంటే- బేషరతుగా ఆయన కాంగ్రెస్‌కు సరెండర్ అయ్యారు. కారణాలేమైనప్పటికీ- చంద్రబాబుకు ఏదైనా ఓ జాతీయ పార్టీ అండ అత్యవసరం. ఎన్డీఏలో ప్రధాని అభ్యర్థి ఒక్కరే, ఇక్కడ ఎందరో. ఇలాంటి సందర్భంలో యునైటెడ్ ర్యాలీలో ప్రతిపక్షాలు చూపిన ఐక్యత ఎన్ని రోజులు ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఐక్యత కొనసాగుతుందనే అనుకుందాం. మరి! కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ మాటేమిటి? వామపక్ష పార్టీలు, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ గూటి కిందికి చేరాలి. మమతా బెనర్జీ ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆయన లెక్క అదే. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాంతర దూరాన్ని పాటించే నాయకుల్లో మమత పేరు టాప్‌లో ఉంటుంది.
ఆ రెండు పార్టీల పేరు వింటేనే మంట పుట్టే మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, మాయావతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కేసీఆర్‌ది. కాలం కలిసి వస్తే తానే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించవచ్చు లేదా మమతను కూర్చోబెట్టి, తాను కథను నడిపించవచ్చనే ధీమా కేసీఆర్‌లో ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పుడిలా హఠాత్తుగా ఆమె కాంగ్రెస్ సహా విపక్షాలను కలుపుకొని ర్యాలీ నిర్వహించడం ఓ రకంగా కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసేదే. కాంగ్రెస్ ఉన్న గూటిలో మమత, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు కొనసాగుతారని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. విపక్షాల ఐక్యత ఎన్ని రోజులు ఉంటుందనేది ఆసక్తికర విషయం. విపక్షాల ఐక్యత నిలవదన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీని బీజేపీ తేలిగ్గా తీసుకుంది. ముందు ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పండంటూ ఎకసెక్కాలు ఆడింది.