కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీ మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ర్యాలీ ఆరంభం కానుంది.
`యునైటెడ్ ఇండియా ర్యాలీ` పేరుతో జరిగే ఈ ర్యాలీకి మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి విపక్ష పార్టీలకు చెందిన సీనియర్లు చాలామంది ఇప్పటికే కోల్‌కతకు చేరుకున్నారు.
మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), హెచ్‌డీ దేవేగౌడ (జనతాదళ్-ఎస్), కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జార్ఖండ్ ముక్తి మోర్చా (ప్రజాతాంత్రిక్) అధినేత బాబూలాల్ మరాండి, హేమంత్ సోరెన్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, అజిత్ సింగ్ (రాష్ట్రీయ లోక్‌దళ్), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ), శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాది పార్టీ), తేజస్వీ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), బీజేపీ అసంతృప్త నేత శతృఘ్న సిన్హా, పాటిదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కోల్‌కతకు చేరుకున్నారు.
వారందరినీ సాదరంగా ఆహ్వానించడానికి కోల్‌కత విమానాశ్రయంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను నియమించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావాల్సి ఉంది. ఆయన వస్తారా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ ఈ ర్యాలీలో పాల్గొంటున్నందున.. టీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. టీఆర్ఎస్ నుంచి ఎవరూ దీనికి హాజరయ్యే అవకాశాలు లేవని ప్రాథమిక సమాచారం.
బహుజన సమాజ్‌వాది పార్టీ తరఫున ఎవరు హాజరవుతారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ర్యాలీకి హాజరు కావట్లేదు. ఎన్డీఏతో పాటు కాంగ్రెస్ ఉన్న ఏ కూటమికీ తాము మద్దతు ఇవ్వబోమని, బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరాన్ని పాటిస్తామని నవీన్ పట్నాయక్ ఇదివరకే ప్రకటించారు.