`కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోంది. మెజారిటీ లేకపోయినా అధికారం కోసం అర్రులు చాస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా భావిస్తోంది. ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికోసం కోట్ల రూపాయలను గుమ్మరిస్తోంది. బీజేపీకి ఇదే నా హెచ్చరిక. మీ ఆటలు సాగనివ్వను. మీరు చేసే తప్పులకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది..`
`కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జెట్ ఫైటర్ల కొనుగోలు పారదర్శకంగా సాగింది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించింది. 136 జెట్ ఫైటర్ల కోసం యూపీఏ ప్రభుత్వం 1.4 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. 36 జెట్ ఎయిర్‌వేస్‌ల కోసం ఎన్డీఏ ప్రభుత్వం అంతే మొత్తాన్ని ఖర్చు చేసింది. అంబానీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీతో రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడమా?`
`నరేంద్రమోడీకి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. మోడీ పబ్లిసిటీ పీఎం..నాట్ పెర్‌ఫార్మింగ్ పీఎం. ఎన్డీఏ ప్రభుత్వం విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటిస్తోంది. ప్రజలను కులాలవారీగా విభజిస్తోంది. ప్రాంతాలవారీగా విధ్వేషాలను రెచ్చగొడుతోంది. రాష్ట్రాలవారీగా విభజించి, పాలిస్తోంది. అందుకే సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో మనం పనిచేస్తున్నాం..`
ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు. కోల్‌కతలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన `యునైటెడ్ ఇండియా ర్యాలీ`లో అక్కడి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన ఈ తరహా ప్రసంగాన్ని విన్న ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. `ఎమ్మెల్యేలు సంతలో పశువులు అనుకుంటున్నారా?` అంటూ ఆయన బీజేపీపై ధ్వజమెత్తడాన్ని చూస్తోంటే.. చంద్రబాబుది రెండు కళ్లు కాదు..రెండు నాల్కల సిద్ధాంతం అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టలో ఉంచుకుని కాంగ్రెస్‌కు మద్దతుగా చంద్రబాబు మాట్లాడటంలో వింతేమీ లేదు. ఆయనది ఏ ఎండకాగొడుగు అనేది తెలిసిన విషయమే. మమతా బెనర్జీని డైనమిక్ లీడర్‌గా చెప్పుకొన్న చంద్రబాబు పరిస్థితులు తనకు ప్రతికూలంగా పరిణమిస్తే, అదే మమతా బెనర్జీపై దారుణ విమర్శలూ చేయగలరు. ఆ సత్తా ఆయనకు ఉంది. రాఫెల్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడారు. యూపీఏ హయాంలో జెట్ ఫైటర్ల కొనుగోలు పారదర్శకంగా సాగిందని వెనకేసుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందనీ అనేశారు. `మోడీ పబ్లిసిటీ పీఎం..నాట్ పెర్‌ఫార్మింగ్ పీఎం` అని ఆయన ఇంగ్లీష్‌లో దంచికొట్టారు. మోడీకి పబ్లిసిటీ పిచ్చి ఎంత వరకు ఉందో తెలియదు గానీ, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి మాత్రం పీక్స్‌లోనే ఉంటుంది. కిందికి దిగదు. చంద్రబాబు తొమ్మిదిన్నరేళ్ల తొలి ఇన్నింగ్‌లోనే కాదు, ఆయన రెండో ఇన్నింగ్‌లోనూ అదే పరిస్థితి. చేయనిది చెప్పుకోవటంలో చంద్రబాబును మించిన ఘనులు లేరనే అనుకోవాలి.
ఉదాహరణలు కోకొల్లలు. పట్టిసీమ ప్రాజెక్టుకు ఎన్నిసార్లు భూమి పూజ చేశారో, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారో మనకు తెలుసు. పోలవరం ప్రాజెక్టులో ఓ సారి స్పిల్ వే అంటారు, ఇంకోసారి గేట్ ఫిట్టింగ్ అంటారు, మరోసారి కాపర్ డ్యామ్ నిర్మాణం అంటారు. ఒక్క ప్రాజెక్టుకు ఇలా ఎన్నిసార్లు ఆయన ఇలా పూజలు చేసుకుంటూ పోయారో మన కళ్లారా చూశాం. అమరావతి శంకుస్థాపన అని ఒకసారి, అమరావతి భూమిపూజ అని ఇంకోసారి.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం చేశారు.
అలాంటి చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో, జాతీయ స్థాయి నేతల సమక్షంలో పచ్చి అవకాశవాదిగా ప్రసంగించారు. ఏపీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో మాత్రమే అవినీతి రహిత పాలన కొనసాగుతోందని జబ్బలు చరచుకున్నారు. బీజేపీని విమర్శిస్తున్నాననే ఉద్దేశంతో చంద్రబాబు తనను తానే నిందించుకున్నట్టు కనిపిస్తోంది ఆయన ప్రసంగం చూస్తోంటే.