ముఖ్యమంత్రికి కరోనా..ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్ 

ముఖ్యమంత్రికి కరోనా..ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్
ఎవరైనా ప్రతినిధికి చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడతారే తప్ప తమ పాలనలో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి కూడా చూడరు.  అందుకే ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అంటే రోగాన్ని మించిన భయం.  పాలించే నాయకులకే సర్కార్ దావఖానాల చికిత్స మీద నమ్మకం లెనప్పుడు మేమెలా తీసుకుంటాం అంటుంటారు.  మన నేతల పనులు కూడా ఈ ఆరోపణలకు బలాన్నిచ్చేవిగానే ఉంటాయి.  కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పని మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.  కరోనా లక్షణాలతో స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  
 
అందులో పాజిటివ్ అని తేలింది.  మామూలుగా అయితే సీఎం స్థాయి వ్యక్తికి కరోనా సోకింది అంటే నెలకొనే అలజడి, జరిగే హడావుడి మామూలుగా ఉండదు.  రాష్ట్రంలో వీలైతే దేశంలోనే ఉత్తమమైనదిగా పేరున్న ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిపోతారు.  కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ హడావుడేమీ చేయలేదు.  పాజిటివ్ అని తేలిన వెంటనే కంగారు పడకుండా అంబులెన్సులో ఎక్కి ఆసుపత్రికి వెళ్లిపోయారు.  ఆది కూడా ప్రభుత్వాసుపత్రికి.  భోపాల్ లో ప్రత్యేకించి కరోనా చికిత్సకు ప్రభుత్వం ప్రత్యేకించిన చిరాయు ఆసుపత్రిలో ఆయన చేరిపోయారు.  ఒక సీఎం ప్రమాదకరమైన కోవిడ్ వైరస్ సోకితే నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు అంటే తన పాలనలో నడిచే ఆ ఆసుపత్రిలోని వైద్యం మీద ఆయనకు ఎంత నమ్మకం ఉండాలి.
 
దీన్నే నిబద్దత, సమానత్వం అంటారు.  తాను ప్రజలకంటే అతీతుడినేమీ కాదనే సింప్లిసిటీ, ప్రభుత్వాసుపత్రులు తన హయాంలో మెరుగ్గా ఉన్నాయనే నమ్మకం ఉండబట్టే శివరాజ్ సింగ్ దర్జాగా, నిర్భయంగా వెళ్లి సర్కార్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ప్రజలనేమో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లండి, అంతా బాగుంది అంటూ చెప్పిన నేతలే కరోనా సోకగానే వెళ్లి అపోలో లాంటి పెద్ద పెద్ద కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.  కొన్నిరోజుల క్రితం వరకు జగన్ పాలనలో ప్రభుత్వాసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకి దీటుగా పనిచేస్తున్నాయని, ప్రజల ప్రాణాలకు భయమేమీ లేదని ఊదరగొట్టిన విజయసాయిరెడ్డి లాంటి అధికార పార్టీ లీడర్లు ప్రభుత్వ వైద్యశాల వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆఘమేఘాల మీద హైదారాబాద్ వెళ్లి కార్పోరేట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  ఈ ఉదంతం చాలు మన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి, వాటి పట్ల పాలకుల చిత్తశుద్ది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి.