తెలంగాణలో అధికార మార్పు అనేది తప్పనిసరి అన్నట్లు ఇప్పటికే తెలిసిపోయింది. ప్రస్తుత సీఎం కేసీఆర్ త్వరలోనే తన పదవిని ప్రస్తుతం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు అప్పగించటానికి సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. నిజానికి మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ సొంతగా మేయర్ స్థానం సాధించి ఉంటే అదే ఊపులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసేవాడు, కానీ తెరాస కు అనుకున్న స్థానాలు లభించకపోవటంతో ఆ ఆలోచనను కొద్దీ రోజులు వాయిదా వేశాడు.
తాజాగా మరోసారి అధికార మార్పిడి వ్యవహారం తెర మీదకు వచ్చింది. మనకి వస్తున్నా సమాచారం ప్రకారం తన రాజకీయ ఆస్తుల విషయంలో సీఎం కెసిఆర్ సృష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా, కవితను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆమె కార్మిక సంఘాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపులో కార్మిక సంఘాలు అత్యంత కీలకం.
ఈ మధ్య కార్మిక సంఘాల విషయంలో కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయా సంఘాలను తెరాస కు దూరం చేశాయనే చెప్పాలి. ఉద్యమ సమయంలో ఉద్యోగుల నుంచి కుల సంఘాల వరకు అన్నింటినీ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఆ పార్టీ నేతలే గౌరవాధ్యక్షులుగా ఉండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఖరిని పూర్తిగా మార్చుకుంది. కొన్ని సంఘాల నుంచి వచ్చిన తలనొప్పులతో ఆయా సంఘాలకు గౌరవాధ్యక్ష పదవుల నుంచి టీఆర్ఎస్ నేతలు తప్పుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అలా ఆర్టీసీ కార్మిక సంఘం నుంచి హరీష్ రావు, సింగరేణి కార్మిక సంఘం నుంచి కవిత కూడా వైదొలిగారు. మిగతా నేతలు కూడా వైదొలిగారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గింది.
దూరమైనా సంఘాలను తిరిగి తమ దారిలోకి తెచ్చే పని కవిత తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఇది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని, దీనిని బట్టి చూస్తే కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లు అర్ధం చేసుకోవచ్చు, అయితే కొడుకును సీఎం చేసి, కూతురికి పార్టీలో రెండో పదవిని కట్టబెట్టిన కేసీఆర్.. మేనల్లుడు తెరాస పార్టీలో కీలక నేత హరీష్ రావుకు ఎలాంటి పదవి ఇస్తాడు..? అతని రాజకీయ భవిష్యతు ఏమిటీ..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.