వైఎస్ జగన్, చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నారా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అడుగు జాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారట. ఈ విషయాన్ని చెబుతున్నది భారతీయ జనతా పార్టీ. నాలుగేళ్ళు టీడీపీతో కాపురం చేసి, చివరి ఏడాదిలో తెగతెంపులు చేసుకుంది బీజేపీ. కాదు కాదు, బీజేపీతో కాపురం చేసి, టీడీపీనే తెగతెంపులు చేసుకుంది. ఎలాగైతేనేం, ఐదేళ్ళు సాగాల్సిన సంసారం, నాలుగేళ్ళ తర్వాత బద్ధలైంది. అప్పటినుంచి టీడీపీ – బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. ఇక, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీపై మాటల దాడి పెంచింది. అంతే, చంద్రబాబుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోల్చేయడం మొదలెట్టింది బీజేపీ. నిజానికి, గతంలో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వైసీపీ – బీజేపీ మధ్య ఏనాడూ పొత్తు లేదు.

అలాంటప్పుడు, చంద్రబాబు – వైఎస్ జగన్.. ఈ ఇద్దర్నీ బీజేపీ ఎలా ఒకే గాటన కట్టగలుగుతుంది.? బీజేపీ అంతే, బోడి గుండుకీ.. మోకాలికీ ముడిపెట్టేయగలదు. ఆంధ్రప్రపదేశ్ అనే రాష్ట్రంలో ఒంటరిగా ఒక్క సీటు తెచ్చుకోలేని దుస్థితి బీజేపీది. కానీ, ఏపీలో రాజకీయాల్ని చెడగొట్టేసి, తామే నిఖార్సయిన జనోద్ధారకులం.. అని చెప్పుకునేందుకు బీజేపీ పడరాని పాట్లూ పడుతోంది. జనం లెక్క చేయకగానీ, లెక్క చేస్తే.. బీజేపీ హంగామా ఇంకోలా వుండేది. ప్రత్యేక హోదా ఇవ్వదు, ప్రత్యేక రైల్వే జోన్ విషయమై సస్పెన్స్ కొనసాగిస్తుంది.. కొత్త స్టీలు ప్లాంటు ఇవ్వదు, వున్న స్టీలు ప్లాంటుని ఎత్తుకెళుతుంది.. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వదు.. రాష్ట్రానికి ఏ రకంగానూ సహకరించదు. కానీ, ఏపీ రాజకీయాల్ని భ్రష్టు పట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. జర జాగ్రత్త బీజేపీతో.. అనే స్థాయికి జనం బెదిరిపోయే పరిస్థితులు వచ్చేయాన్న సంగతి బీజేపీకే అర్థం కావడంలేదు. జగన్, చంద్రబాబు అడుగుజాడల్లో నడవడం కాదు, బీజేపీనే.. కాంగ్రెస్ వెనకే పాతాళంలోకి వెళ్ళిపోయింది.