మూడు రాజధానుల బిల్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం స్టేటస్ కో ఇవ్వడంతో 3 క్యాపిటల్స్, సీఆర్డీయే బిల్లు అమలుకు ఆటంకం ఏర్పడింది. శాసనసభలో బిల్ పాస్ చేసుకున్నా, గవర్నర్ ఆమోదం పొందినా కూడా రాజధానులను విడదీయలేకపోతుండటంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్ర అసహానానికి లోనవుతోంది. న్యాయ వ్యవస్థ మీద, ప్రతిపక్షాల మీద పాలక వర్గం చేస్తున్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. పైగా సుప్రీం కోర్టు సైతం హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో మీద స్టే ఇవ్వలమని తేల్చింది. సెప్టెంబర్ 21 వరకు ఈ స్టేటస్ కో కొనసాగనుండగా 21 నుండి పిటిషన్ల మీద రోజువారీ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో ఎలాగైనా గెలిచి పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ భావిస్తున్నారు. కానీ కేసు ఈ 2020లో తేలదని, 2021 ఆరంభంలో ఏమైనా కొలిక్కి రావొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే రాజధాని తరలింపుకు అడ్డంకులన్నీ తొలగినట్టే. తీర్పు వెలువడిన మరిసటి రోజే మార్పు జరిగిపోతుంది.
అసలు గండం ముందుంది :
అలా జరిగినా మరొక చిక్కు ఉంది. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించడం కోర్టు తీర్పు మీద ఆధారపడిన విషయమే అయినా హైకోర్టును కర్నూలు జిల్లాకు మార్చడం వెనుక పెద్ద తతంగమే ఉంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిని మార్చినంత సులువు కాదు హైకోర్టును మార్చడం. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదు. శాసన విభాగం, పాలనా విభాగం అంటే రాష్ట్ర శాసనసభ చేతిలో పనులు కాబట్టి సులభంగా ఆమోదాలు వచ్చేశాయి. కానీ హైకోర్టును మార్చడమనేది రాష్ట్రపతి పరిధిలోని వ్యవహారం. విభజన చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ చేస్తేనే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మార్చడం వీలయ్యే పని. ఇక్కడ మరొక అవరోధం కూడ ఉంది. హైకోర్టు మార్పు రాష్ట్రపతి నోటిఫికేషన్ చేస్తేనే మారినా ఆయన ఆ నోటిఫికేషన్ చేయాలంటే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తప్పనిసరి.
వారి సలహాలు, సూచనలు తీసుకునే ప్రెసిడెంట్ తుది నిర్ణయం తీసుకుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ ఆమోదం మీదనే ఆయన హైకోర్టు మార్పును నోటీఫై చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే హైకోర్టు కర్నూలుకు వెళ్లడమా, వెళ్ళకపోవడమా అనేది మోదీ నిర్ణయం. గతంలో కూడ రాష్ట్రపతి నోటిఫై చేశాకనే
హైకోర్టు హైదరాబాద్ నుండి అమరావతికి మారింది. ఇప్పుడు కూడ అదే ప్రాసెస్ జరగాలి. బీజేపీ ఏపీ విషయంలో పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్న తరుణంలో ఇదంతా జరుగుతుందా అంటే పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. తాము అమరావతికే కట్టుబడి ఉన్నామన్న బీజేపీ రాజధాని అనేది రాష్ట్రం పరిధిలోని అంశం కాబట్టి తామేమీ జోక్యం చేసుకోలేమని అంది. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో న్యాయస్థానానికి తెలిపింది. అంటే అవకాశం ఉంటే అమరావతిని విచ్ఛిన్నం కాకుండా ఆపేవారమే కానీ అవకాశం లేదనే కదా అర్థం. కానీ ఆ అవకాశం హైకోర్టు మార్పు విషయంలో కేంద్రానికి మొండుగా ఉంది.
మోదీ ఆదుకుంటారా.. ఆడుకుంటారా ?
ఒకప్పుడు రాజధానిగా వెలుగొంది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక ఆ హోదాను కోల్పోయిందని, ఎప్పటికైనా రాజధానిగా కర్నూలు జిల్లా మారితే ఆ వైభవాన్ని చూడాలని రాయలసీమ ప్రజలు చాలా ఆశగా ఉన్నారు. వారికిది దశాబ్దాల కల. జగన్ మూడు రాజధానులు అనడం, న్యాయ రాజధానిగా కర్నూలు జిల్లా ఉంటుందని మాటివ్వడంతో ఆ కల నెరవేరుతుందని సీమవాసులు భావించారు. వారి ఆశల్ని జగన్ నెరవేర్చలేకపోతే వారి రియాక్షన్ వేరుగా ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే విపక్షం టీడీపీ సీమను వైఎస్ జగన్ న్యాయ రాజధాని పేరు చెప్పి సీమ ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారని, సీమ మీద అంత ప్రేమే ఉంటే నవ్యాంధ్ర ఏర్పడేటప్పుడే సీమలో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేయవచ్చు కదా. ఇదంతా ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకునే ఎత్తుగడ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇకవేళ హైకోర్టును కర్నూలులో పెట్టలేకపోతే ఆ ఆరోపణలే నిజమవుతాయి.
ఒకరకంగా జగన్ కు విశాఖ కంటే కర్నూలులో హైకోర్టు అనేదే పెద్ద సవాల్. అవతల బీజేపీ అమరావతికి కట్టుబడి ఉన్నామని, కర్నూలుజిల్లాలో హైకోర్టు తమ విధానమని ప్రకటించి కూర్చుంది. అమరావతికి న్యాయం చేయాలి అంటే శాసన రాజధానితో పాటు పాలన రాజధాని కూడా అక్కడే ఉండాలి. కానీ దాన్ని నిర్ణయించే హక్కు వారికి లేదన్నారు కాబట్టి డిసైడ్ చేసే పవర్ ఉన్న హైకోర్టును అమరావతిలోనే ఉంచి పాలనా రాజధాని తరలిపోయిన లోటును కొంతైనా పూడ్చాలి. లేకపోతే కర్నూలు లో హైకోర్టు ఉండాలనేది తమ విధానం అన్నారు కాబట్టి హైకోర్టు తరలింపులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఈ రెండింటిలో కేంద్రం ఏవైపు మొగ్గుచూపుతుంది అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. మరి చివరకు జగన్ మోదీ సహకారం పొంది సీమ జనం దృష్టిలో హీరో అవుతారో లేకపోతే మోదీ అడ్డం తిరిగి జీరో అవుతారో కాలమే చెప్పాలి.