Covid 19 : మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్: అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా.?

Covid 19 : అగ్రరాజ్యం అమెరికాలో సగటున రోజూ 10 లక్షలకు పైగా కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నాయి. అక్కడ వ్యాక్సినేషన్ చాలా వేగంగా జరిగింది.. రెండో డోస్ మాత్రమే కాదు, మూడో డోస్ వ్యాక్సినేషన్ కూడా చాలావరకు పూర్తయిపోతోంది. మరెందుకు అమెరికాలో కోవిడ్ 19 విజృంభిస్తోంది.?

యూరోప్ దేశాలు కోవిడ్ 19 తాజా వేవ్ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. ఆ దేశం, ఈ దేశం అన్న తేడాల్లేవు.. ప్రపంచంలో చాలా దేశాలది ఇదే పరిస్థితి. ఎందుకిలా.? అసలు వ్యాక్సినేషన్ సత్ఫలితాలనిస్తోందా.? లేదా.? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

మొదటి డోస్ వ్యాక్సినేషన్‌తోనే చాలా వరకు రక్షణ లభిస్తుందనీ, రెండో డోస్ వ్యాక్సినేషన్ తర్వాత రక్షణ మరింత మెరుగవుతుందనీ వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. అయితే, వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టలేమనీ, కోవిడ్ సోకకుండా ఆపలేమనీ, కోవిడ్ వల్ల వచ్చే తీవ్ర అనారోగ్యం నుంచి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు ఆ తర్వాత మాటమార్చారు.

ఇప్పుడేమో పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య నిన్న 60 వేలకు చేరువయ్యింది. నేడు అది లక్షకు చేరుతుందా.? అంటే, దాటినా దాటొచ్చన్న అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అమెరికా తరహాలో రోజుకి 10 లక్షల కొత్త పాజిటివ్ కేసులు నమోదైతే పరిస్థితి ఏంటి.? అమెరికా జనాభాతో పోల్చితే, మన జనాభా చాలా చాలా ఎక్కువ. ఆ లెక్క, రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు 20 లక్షలు ఆ పైన నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వందల కోట్లు కాదు, వేల కోట్లు ఖర్చు చేసి దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ షురూ అయ్యింది. బూస్టర్ డోస్ కూడా షురూ చేస్తున్నారు. కానీ, కోవిడ్ వైరస్ మాత్రం భయపెడుతూనే వుంది. వ్యాక్సిన్ సమర్థతపై చర్చ జరగాల్సిన సందర్భమిది. అసలు కోవిడ్ చికిత్స కోసం ప్రామాణికమైన మందు ఏదీ ఇప్పటిదాకా అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.