బాధ్యత లేని ప్రభుత్వాలు: ఇవేం చదువులు మహాప్రభో.!

What About Students' Future

What About Students' Future

కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా విద్యా సంస్థలు అరకొరగానే పనిచేస్తున్నాయి. కొన్నాళ్ళు పూర్తిగా మూతపడ్డాయి.. ఆ తర్వాత పాక్షింగా తెరచుకున్నాయి.. మళ్ళీ మూతబడ్డాయి.. ఇప్పుడిప్పుడే మళ్ళీ విద్యా సంస్థలు తెరచుకునే పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండేళ్ళపాటు చాలావరకు పరీక్షలు రద్దయ్యాయి. డైరెక్ట్ ప్రమోషన్లే ఎక్కువ.. పై తరగతులకు అవలీలగా వెళ్ళిపోతున్నారు విద్యార్థులు.

ఇది కొందరికి ఇష్టం, ఇంకొందరికి కష్టం. ఇప్పటికి ఇలా నడుస్తోంది వ్యవహారం. భవిష్యత్తు ఏమిటి.? అదే భయానకంగా తయారైంది. ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయి. దేశంలో ఎంతమంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో వున్నాయి.? అన్న కనీసపాటి ఆలోచన లేకుండా ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ విద్య అంటున్నాయి. సరే, కష్టమో.. నష్టమో.. స్మార్ట్ ఫోన్లు లాప్ టాప్స్ సమకూర్చుకుంటున్నారు విద్యార్థులు.

కానీ, ఆ స్మార్ట్ పాఠాలు ఎంతమందికి అర్థమవుతున్నాయి.? వాటి మీద ప్రభుత్వాలు ఎలాంటి అధ్యయనాలు చేశాయి.? అంటే, ఏమీ లేదనే చెప్పాలి. మామూలుగానే ఉపాధ్యాయులు కాకరకాయ్.. అంటే, విద్యార్థులకు కీకరకాయ్ అని అర్థమవుతుంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు ఏడెనిమిది గంటలు జరిగే ప్రత్యక్ష బోధనకీ, రెండు మూడు గంటలు జరిగే ఆన్‌లైన్‌ బోధనకీ ఒకే తరహా ఫీజు వసూలు చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు.

ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వాలు జీవోలు విడుదల చేస్తే, విద్యా సంస్థలు మాత్రం, నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణలేని ప్రభుత్వాలు, విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నది నిర్వివాదాంశం. నిజానికి, దోపిడీ ప్రైవేటు విద్యా సంస్థలది మాత్రమే కాదు.. ఆ దోపిడీని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలది కూడా.